ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy: తెలంగాణ ప్రజలకు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ.. ఏముందంటే..

ABN, First Publish Date - 2023-11-28T15:26:00+05:30

దశాబ్దాల పోరాటం, నీళ్లు - నిధులు - నియామకాల కోసం ఆరాటం, లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు, టియర్ గ్యాస్‌తో కళ్ల మంటలు.. ఇవి సరిపోవడం లేదని

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

లేఖలో ఏముందంటే..

‘‘దశాబ్దాల పోరాటం, నీళ్లు - నిధులు - నియామకాల కోసం ఆరాటం, లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు, టియర్ గ్యాస్‌తో కళ్ల మంటలు.. ఇవి సరిపోవడం లేదని 1969లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పోలీసుల కాల్పుల్లో 369 మంది విద్యార్థుల బలిదానం, మలిదశ ఉద్యమంలో మనకళ్లముందే 1200 మంది ఆత్మబలిదానం, చిన్న నుంచి పెద్ద వరకు, సకల జనులంతా ఏకమై.. గొర్లు, బర్లు కాసే వాళ్ల దగ్గరన్నుంచి వర్సిటీ ప్రొఫెసర్ల వరకు, వివిధ రంగాల నిపుణులు, మహిళలు, యువత వరకు.. ఇలా ఒకరిద్దరు కాదు.. నాలుగుకోట్ల తెలంగాణ గొంతుకలు ఏకమై నినదిస్తే, ఎన్నో త్యాగాలు చేస్తే మన తెలంగాణ సాధ్యమైంది. ఇది ఏ ఒక్క వ్యక్తి ద్వారానో.. లేక ఒక కుటుంబ త్యాగం వల్ల రాలేదనే విషయం మనందరికీ తెలుసు.

ఇంతటి సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. ఉద్యమ ఆకాంక్షలను చేరుకుందా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలంగాణ ప్రజలు తమ గుండెమీద చేయివేసుకుని చెప్పుకోవాలి. ఉద్యమ నినాదమైన ‘నీళ్లు, నిధులు, నియామకాల’ లక్ష్యాలను చేరుకోవడంలో.. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సంపూర్తిగా విఫలమైంది. మిగులు బడ్జెట్, పుష్కలమైన వనరులతో ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రం.. పదేళ్లలో ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేక.. తీవ్ర ఇబ్బందుల పాలైంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ పాలనాపరమైన అసమర్థత కళ్లకు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర రాజధాని వరకు ఎక్కడికక్కడ సమస్యలు తిష్టవేసుకుని కూర్చున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సాధనలో నీటి కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి నినదించాం. కానీ రాష్ట్రం వచ్చాక ఈ ‘నీళ్ల’ పేరుతో.. కేసీఆర్ ప్రభుత్వం బహిరంగంగానే దోపిడీకి పాల్పడింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ.. ఆ తర్వాత భారీ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అంచనాలు పెంచి.. అడ్డగోలు దోపిడీకి కేసీఆర్ బాటలు వేయడం నిజం కాదా?, ఇటు గోదావరి జలాలు, అటు కృష్ణ జలాలను అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తీవ్ర అన్యాయం జరిగింది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. రాష్ట్రం ఏర్పడి తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే.. ఉద్యమం సందర్భంగా తీసుకున్న ‘నీళ్ల’ నినాదానికి ఏం న్యాయం జరిగినట్లు.

నిధుల విషయంలోనూ ఇదే తంతు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న మిగులు బడ్జెట్ కాస్త పదేళ్లలో 7 లక్షల కోట్ల అప్పుగా మారింది. నిధుల సద్వినియోగం విషయంలో సరైన అవగాహన లేకపోవడం, ఆర్థిక క్రమశిక్షణ కట్టుబాటు తప్పడం వంటివి.. తెలంగాణలో నిధుల సంపూర్ణ దుర్వినియోగానికి కారణమయ్యాయి. ఈనాడు అప్పుల కుప్పయిన తెలంగాణలో ప్రతి వ్యక్తి మీద దాదాపు లక్షా 25వేల అప్పు ఉందన్నది ఓ అంచనా.

నియామకాల విషయంలో.. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం తీవ్ర ఆక్షేపణీయం. ఉద్యమంలో యువత లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు, టియర్ గ్యాస్‌ను లెక్కచేయకుండా పోరాడితే.. రాష్ట్రం వచ్చాక వారికి ఒరిగిందేమీ లేదు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేందుకు కారణమైన నిరుద్యోగ యువత.. ఇవాళ ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితికి చేరుకోవడానికి కారణం కేసీఆర్ అసమర్థ పాలన కాదా? TSPSC పరిస్థితి ‘మూడు లీకేజీలు, ఆరు రద్దులుగా’ మారింది. రాష్ట్రంలోని 39 లక్షల మంది నిరుద్యోగుల్లో ఒక్కశాతానికైనా ఉద్యోగాలు అందాయా? రూ.3,106ల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఎందరికి అందింది? విద్యార్థుల ఆత్మహత్యలను అవహేళన చేసేలా కేసీఆర్ కుటుంబసభ్యులు మాట్లాడం.. తెలంగాణలోని నా నిరుద్యోగ తమ్ముళ్లు, చెల్లెళ్ల ఆవేదనను, ఆక్రందనను శంకించడమే అవుతుంది.

ఇలా నీళ్లు, నిధులు, నియామకాలకోసం, సామాజిక తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న ఘనమైన చరిత్ర మనది. కానీ పదేళ్లలోనే ఇవన్నీ పటాపంచలు చేస్తూ కేసీఆర్.. కేవలం కుటుంబాన్ని బంగారు మయం చేసుకుని.. మన తెలంగాణను ’బందీఖానా’గా మార్చాడు. విద్యా, వైద్య వ్యవస్థలు కుంటుబడ్డాయి. పరిపాలన పడకేసింది. వేలకోట్లు దుర్వినియోగం అయినా.. ఎక్కడా ఫలితం కనిపించడం లేదు.

ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? దీనిపై తెలంగాణ ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిది. అసలు ఈ పదేళ్లలో రాష్ట్రంలో సంతృప్తి చెందిన వర్గం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఏమైనా అర్థం ఉందా?

దళితులకు మూడెకరాలు, ముఖ్యమంత్రి పదవి అని చెప్పి కేసీఆర్ మోసం చేస్తే.. వారిని అక్కున చేర్చుకున్న మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం వారు చేస్తున్న డిమాండ్లను గుర్తించి.. ప్రధానమంత్రి హోదాలో వారి సభకు హాజరై భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారు. ఆరేడు దశాబ్దాలుగా రాజ్యాధికార కాంక్షతో ఉన్న బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు.. తెలంగాణలో తొలి బీజేపీ ముఖ్యమంత్రి వెనుకబడిన వర్గాలకు చెందినవారేనని ప్రకటించారు. ఇదంతా.. తెలంగాణ ప్రాంతంలోని వివిధ సామాజిక వర్గాల ఆకాంక్షలకు సరైన గౌరవాన్ని ఇవ్వడమే కాకుండా.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్షాల్లో ఒకటైన ‘సామాజిక తెలంగాణ’ సాధన దిశగా బీజేపీకి ఉన్న కమిట్‌మెంట్‌కు నిదర్శనం. ఇది కాకుండా.. తొమ్మిదిన్నరేండ్లలో రూ.9లక్షల కోట్లు రాష్ట్రాభివృద్ధికి ఖర్చుచేశారు.

అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్ల బండిగా ముందుకు తీసుకెళ్తున్న మోదీ ప్రభుత్వం.. మన రాష్ట్రానికి మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్ ప్రభుత్వం సహకారం అందించడం లేదు. రాష్ట్రంలో పథకాలు సరిగ్గా అమలుకావు.. అదే సమయంలో.. కేంద్రం ఇచ్చే నిధులకు, సహకారానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణతో మోకాలడ్డుతోంది.

అదే సమయంలో.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మొదట్నుంచీ అవహేళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రతి నిర్ణయంలోనూ తన రాజకీయ లబ్ధి చూసుకోవడమే తప్ప.. ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించదు. ఉద్యమ సమయం నుంచి ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీతో కలిసి తెలంగాణను ముుంచడానికే సిద్ధమయ్యాయి. అయితే నువ్వు, లేదంటే నేను.. మనిద్దరిలో ఎవరైనా ఒకరు అధికారంలో ఉండాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీల చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు ఇదే. 2014, 2018లో కాంగ్రెస్ గుర్తుమీద గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయకుండానే.. బీఆర్ఎస్‌‌లో చేరడం, మంత్రిపదవులు పొందడం మనందరికీ గుర్తుండే ఉంటుంది. నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ఖజానాను తమ ఏటీఎంగా మార్చుకున్న చరిత్ర వీరిద్దరిది కాదా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను ఓటు బ్యాంకులుగా తప్ప ప్రజలుగా గుర్తించలేదు ఈ రెండు పార్టీలు. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేయడంలో ఒకరికొకరు సాటి. అవినీతి, అక్రమాలు, బంధుప్రీతితో తెలంగాణకు ఒరిగేదేమిటి? ఇవాళ్టి పరిస్థితుల్లో తెలంగాణకు.. సుస్థిరమైన, సామర్థ్యం కలిగిన పాలన అత్యంత అవసరం. అది కేవలం ప్రధానమంత్రి మోదీగారి మార్గదర్శనంలో బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రజలకు అందించగలదు.

వీటన్నింటిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. ఒక పొరపాటు చేసి పదేళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. మరో పొరపాటుకు తావులేకుండా బీజేపీ నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసుకుందాం. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు సరైన బుద్ధి చెబుదాం.

ఎన్నికలకు మిగిలిన ఈ ఒక్క రోజు.. మద్యం, డబ్బు ద్వారా ప్రలోభాలకు గురిచేసేందుకు చాలా ప్రయత్నిస్తారు. దయచేసి వారి ఒత్తిళ్లకు లొంగకండి. మరో రెండ్రోజుల్లో మన రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సందర్భంలో.. నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తూ.. తెలంగాణ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణంగా మద్దతు తెలపాలని కోరుతున్నాను. మీ ఆశీర్వాదంతో బీసీ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసుకుందాం. అమరవీరులు కలలుగన్న ‘సామాజిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల తెలంగాణ స్వప్నాన్ని’ సాకారం చేసుకుందాం.’’ అని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-28T15:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising