Telangana Election: పతాక స్థాయికి ప్రచారం
ABN, First Publish Date - 2023-11-21T03:06:35+05:30
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. జాతీయ స్థాయి నేతలు రాష్ట్రానికి క్యూకట్టేందుకు షెడ్యూళ్లను సిద్ధం ..
రంగంలోకి మోదీ, రాహుల్, మాయావతి ఇతర అగ్రనేతలు
రేపు, ఎల్లుండి మాయావతి ప్రచారం
24 నుంచి తెలంగాణలోనే రాహుల్
25న ప్రధాని మోదీ రాక..!
జనసేనాని సైతం ప్రచారక్షేత్రంలోకి..
ఇప్పటికే కేసీఆర్, రేవంత్ సుడిగాలి ప్రచారం
చివరి వారంలో హీటెక్కనున్న తెలంగాణ
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. జాతీయ స్థాయి నేతలు రాష్ట్రానికి క్యూకట్టేందుకు షెడ్యూళ్లను సిద్ధం చేసుకున్నారు. తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలుండడంతో.. అగ్రనేతలు ఇప్పటి వరకు రాష్ట్రంపై పెద్దగా దృష్టి సారించలేకపోయారు. మిగతా రాష్ట్రాల్లో ప్రచారపర్వం పూర్తవ్వడంతో(రాజస్థాన్‌లో మంగళవారంతో ముగుస్తుంది) అగ్రనాయకులు రాష్ట్రంలో పర్యటనలకు సిద్ధమయ్యారు.
కామారెడ్డిలో.. 25న మోదీ ప్రచారం
తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారానికి ప్రధాని మోదీ మూడు రోజులు కేటాయించారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో రోజుకు రెండు చొప్పున.. మొత్తం ఆరు సభల్లో ఆయన పాల్గొంటారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో ఈ నెల 25న మోదీ సభ షెడ్యూల్ ఉంది. కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 24 నుంచి 27 వరకు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న అమిత్‌షా.. మొత్తం పది సభల్లో పాల్గొంటారు. యోగి కూడా ఇవే రోజుల్లో 10 సభల్లో పాల్గొంటారు. 23 నుంచి 27 వరకు రాష్ట్రంలోనే మకాం వేయనున్న జేపీ నడ్డా.. పదికి పైగా సభలకు హాజరవుతారు. రాజ్‌నాథ్ సింగ్.. 24, 25 తేదీల్లో ఆరు సభల్లో ప్రసంగిస్తారు. బీజేపీ-జనసేన అభ్యర్థుల తరఫున జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా రంగంలోకి దిగనున్నారు. ఆయన ఈ నెల 22న వరంగల్, 23న కొత్తగూడెం, 25న తాండూరు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 26న కూకట్‌పల్లిలో జరిగే సభలో అమిత్‌షాతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
రాహుల్, ప్రియాంక సుడిగాలి పర్యటన
ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక ఈ నెల 24 నుంచి పూర్తిగా తెలంగాణలోనే మకాం వేసి, ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే కర్ణాటక, ఛత్తీ్‌సఘడ్, రాజస్థాన్ సీఎంలు సిద్దరామయ్య, భూపేశ్ భగేల్, అశోక్ గెహ్లోత్‌లనూ చివరి ఐదు రోజుల్లో ప్రచార పర్వంలోకి దింపేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర పెద్దలూ ప్రచారంలో పాలుపంచుకోనున్నారు. 24, 25, 27 తేదీల్లో పది నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి నియోజకవర్గాల్లో, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిరల్లో, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాలల్లో ఆమె ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. 26, 28 తేదీల ప్రచారానికి సంబంధించి ఇంకా నియోజకవర్గాలు ఖరారు కాలేదు.
సూర్యాపేట, పెద్దపల్లిల్లో మాయావతి
బీఎస్సీ అభ్యర్థుల తరపున ఈ నెల 22, 23 తేదీల్లో ఆ పార్టీ చీఫ్ మాయవతి ప్రచారం చేయనున్నారు. 22న సూర్యాపేట జిల్లాలోని గాంధీనగర్, 23న పెద్దపల్లి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ఆమె హాజరవుతారు. పెద్దపల్లి జూనియర్ కాలేజీలో జరిగే ర్యాలీలో ఆమె పాల్గొటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
Updated Date - 2023-11-21T11:21:28+05:30 IST