కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Election Results: బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు ఇవేనా?

ABN, First Publish Date - 2023-12-03T14:14:27+05:30

BRS Party: కేసీఆర్ ఒకటి తలిస్తే.. తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు. హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన గులాబీ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం తన ఓటమిని తానే కొని తెచ్చుకుంది.

Telangana Election Results: బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు ఇవేనా?

కేసీఆర్ ఒకటి తలిస్తే.. తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు. హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన గులాబీ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం తన ఓటమిని తానే కొని తెచ్చుకుంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న తరహాలో బీఆర్ఎస్ ఓటమికి కూడా అన్నే కారణాలు ఉన్నాయని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ పేరు మార్పు బీఆర్ఎస్ ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేని పరిస్థితుల్లో జాతీయ రాజకీయాలపై పోరాటం చేస్తామంటూ కేసీఆర్ తమ పార్టీ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు. నిజానికి టీఆర్ఎస్ పేరు ఆ పార్టీకి సెంటిమెంట్‌గా మారిందనే చెప్పాలి. తెలంగాణ కోసం కొట్లాడి పోరాటం చేసి సాధించామని చెప్పుకునే కేసీఆర్‌ తన పార్టీ పేరులో తెలంగాణ తీసివేయడం పెద్ద మైనస్ అని అందరూ చర్చించుకుంటున్నారు.

మరోవైపు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంతో కేసీఆర్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. అవినీతి, అక్రమాల కారణంగానే ప్రాజెక్టు కుంగిపోయిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడం ప్రజలు గమనించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి మరో ప్రధాన కారణం యువత. రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సరైన విధానంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌లు ఇవ్వకపోవడం, టీఎస్‌పీఎస్సీలో పేపర్ లీకులు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఆయా అంశాలను కేసీఆర్ సరిగ్గా డీల్ చేయలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. పేపర్ లీకుల అంశం విద్యార్థులను చికాకు పెట్టింది. రైతు బంధు పథకం కౌలు రైతులకు ఇవ్వకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని ప్రచారం జరుగుతోంది. పలు పథకాలను బీఆర్ఎస్ అమలు చేసినా అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. వికలాంగులకు పెన్షన్ పెంచడం, లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు వంటి అంశాలు ఎన్నికలకు రెండు నెలల ముందే కేసీఆర్ చేపట్టారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఆయా పథకాలను గతంలోనే అమలు చేసి ఉంటే తమ పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెరిగి ఉండేది. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతల్లో గర్వం, అహంకారం పెరగడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. ఎన్నికలకు ముందు పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయడం కూడా బీఆర్ఎస్‌కు మైనస్‌ అయ్యింది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-03T14:14:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising