Tenth Paper leak: కమలాపూర్ టెన్త్ పేపర్ లీక్ కేసులో విద్యార్థికి బిగ్ రిలీఫ్
ABN, First Publish Date - 2023-04-08T16:41:15+05:30
కమలాపూర్ టెన్త్ పేపర్ లీక్ (Tenth Paper leak) కేసులో డీబార్ అయిన విద్యార్థికి బిగ్ రిలీఫ్ (Big Relief) దక్కింది. విద్యార్థికి ఊరట కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.
హైదరాబాద్: కమలాపూర్ టెన్త్ పేపర్ లీక్ (Tenth Paper leak) కేసులో డీబార్ అయిన విద్యార్థికి బిగ్ రిలీఫ్ (Big Relief) దక్కింది. విద్యార్థికి ఊరట కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) ఉత్తర్వులిచ్చింది. మిగిలిన టెన్త్ పరీక్షలు (Tenth Exams) రాసేందుకు విద్యార్థికి న్యాయస్థానం అనుమతిచ్చింది. కుమారుడి డిబార్‌ను వ్యతిరేకిస్తూ విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం సోమవారం నుంచి పరీక్షలకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది. కమలాపూర్ పేపర్ టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హీట్ పుట్టించింది. ఈ కేసులో బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay), మహేశ్, ప్రశాంత్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఈ ముగ్గురిలో బండి సంజయ్‌కి కోర్టు బెయిల్ ఇచ్చింది. వీళ్లతో పాటు మరో మైనర్ బాలుడిని జువైనల్‌కు తరలించారు. డిబార్‌కు గురయిన తండ్రి హైకోర్టు మెట్లెక్కారు. సదరు విద్యార్ధి ఐదేళ్ల పాటు పరీక్షలు రాయకూడదని అధికారులు నిషేధం విధించారు. అయితే విద్యార్థి తండ్రి పిటిషన్‌లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. తన కుమారుడి వల్ల టెన్త్ పేపర్ ప్రత్యక్షంగా లీక్ కాలేదని, ఎవరో వ్యక్తి బయట నుంచి వచ్చి తన కుమారుడి వద్ద నుంచి బలవంతంగా పేపర్ తీసుకుని ఫొటో తీశారని, అలా పేపర్ బయటకు వెళ్లిందని పిటిషన్ (Petition)లో పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు ఎఫ్‌ఐఆర్ (FIR)లో నలుగురి పేర్లు మాత్రమే ప్రస్తావించారని, తన కుమారుడి పేరు ఎక్కడా పేర్కొనలేదని విద్యార్థి తండ్రి హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని ఎలా డీబార్ చేస్తారని. ఐదేళ్ల పాటు ఎలా నిషేధిస్తారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ (Tenth Hindi Question Paper Leakage) లో తనకు ఎలాంటి పాత్ర లేకున్నా.. తనను ఐదేళ్లపాటు డిబార్ చేసి తన జీవితాన్ని నాశనం చేశారని బాధిత ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ తప్పూ చేయలేదని, తనను బలిపశువును చేయొద్దని వేడుకున్నాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని జడ్పీ హైస్కూల్‌లో గురువారం ఇంగ్లిష్ పరీక్ష రాసేందుకు రాగా, అధికారులు అడ్డుకొని అతడిని బయటకు పంపించిన విషయం తెలిసిందే. ‘నేను కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చవుతున్నాను. ఈ నెల 4న కమలాపూర్‌లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఫస్ట్ ఫ్లోర్‌లో కిటికీ పక్కన కూర్చొని హిందీ పరీక్ష రాస్తుండగా.. ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. అతడిని చూసి షాక్ అయ్యాను. కిటికీ వద్ద నిలబడి ‘ప్రశ్నపత్రం ఇవ్వు తమ్మీ..’ అని అడిగాడు. నేను ఇవ్వనని చెప్పాను. ఇన్విజిలేటర్ మేడమ్‌కు చెబుతానని బదులిచ్చాను. ‘అలా చేస్తే చంపుతా’ అని బెదిరించాడు. కిటికీలోంచి నా ప్రశ్నపత్రం లాక్కున్నాడు. వెంటనే సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకొని ప్రశ్నపత్రాన్ని తిరిగి నాపైకి విసిరేసి వెళ్లిపోయాడు. ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగింది’ అని విద్యార్థి తెలిపాడు.
కాగా, గురువారం ఇంగ్లిష్ పరీక్ష రాసేందుకు కమలాపూర్ జడ్పీ హైస్కూల్‌కు రాగా.. డీఈవో తనను స్టాఫ్ రూమ్‌కు పిలిపించుకొని ‘నిన్ను డిబార్ చేశాం..’ అని తెలిపి సంతకం చేయించుకొని, హాల్‌టికెట్ తీసుకొని బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని, డిబార్‌ను రద్దు చేసి.. మిగతా పరీక్షలకు అనుమతించాలని కోరాడు. కాగా, హరీశ్ స్వస్థలం హనుమకొండ జిల్లా దామెర మండలంలోని సీతారాంపూర్. తండ్రి రాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి లలిత కూలికి వెళ్తుంటుంది. విద్యార్థి హరీశ్‌ను ఐదేళ్ల పాటు డిబార్ చేశామని ఎంఈవో రాంకిషన్ రాజు తెలిపిన సంగతి తెలిసిందే.
Updated Date - 2023-04-08T16:52:43+05:30 IST