Yadadri: యాదగిరిక్షేత్రంలో భక్తుల సందడి
ABN, First Publish Date - 2023-03-12T19:27:18+05:30
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వరుస సెలవులు రావడంతో నృసింహుడి దర్శనానికి భక్తులు (Devotees) పెద్దసంఖ్యలో యాదగిరిగుట్ట క్షేత్రానికి తరలివచ్చారు. కొండకింద లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఇష్టదైవాల దర్శనాల కోసం కొండపైన చేరుకున్నారు. కొండపైన ఆలయ తిరువీధులు, స్వామివారి ఉభయ దర్శనాల క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. 35వేల మంది లక్ష్మీనృసింహుడిని దర్శించుకోగా, ధర్మ దర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది.
శాస్త్రోక్తంగా నిత్య పూజలు
వేకువజామున సుప్రభాతంతో నిత్యారాధనలు ఆరంభించిన ఆచార్యులు రాత్రి వేళ మహానివేదన, శయనోత్సవ పర్వాలతో ఆలయ ద్వారబంధనం చేశారు. గర్భాలయంలోని స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్పవ పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్య పూజలు, నిత్య రుద్రహవనం, కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.50,64,604ల ఆదాయం సమకూరింది.
స్వామి సేవలో ప్రముఖులు
గుజరాత్ రాష్ట్రం సూరత్ ఎస్పీ హరీష్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం తెలిపారు. ప్రదానాలయంలో స్వయంభువులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అష్టభుజి ప్రాకార మండపంలో వీరికి అర్చకులు ఆశీర్వచనం చేయగా, దేవస్థాన అధికారులు స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
Updated Date - 2023-03-12T19:27:18+05:30 IST