Emojis : అమ్మో.. బొమ్మ
ABN, First Publish Date - 2023-07-27T01:57:46+05:30
పేరెందుకుగానీ.. అనగనగా కెనడాలో ఒక రైతు. అవిసె గింజలు పండిస్తుంటాడు. 2021లో.. ఒక కొనుగోలుదారు ఆ రైతుకు ఫోన్ చేసి 86 టన్నుల అవిసెగింజలు కావాలని అడిగాడు. ఆ తర్వాత వాట్సాప్(Whatsapp)లో దీనికి సంబంధించిన ఒప్పందపత్రాన్ని కూడా పంపాడు.
ఎమోజీలను ఈజీగా తీసుకోవద్దు!
చాటింగ్‌లో వీటి వాడకంతో సమస్యలుకోర్టుల దాకా వెళ్తున్న కొన్ని వ్యవహారాలు
కెనడాలో వాట్సా్‌పలో ‘థమ్సప్’ ఎమోజీ
పెట్టిన రైతుకు రూ.50 లక్షల జరిమానా
ఆ ఎమోజీని పెట్టడంలో అతడి ఉద్దేశం
ఒకటైతే.. అందుకున్న వ్యక్తి భావన వేరు
ఇజ్రాయెల్‌లో కోర్టుకెక్కిన అద్దె ఇంటి గోల
ఎమోజీల ఆధారంగానే తీర్పు చెప్పిన కోర్టు
అమెరికాలో పెరుగుతున్న ఈ తరహా కేసులు
డ్రగ్స్ విక్రయాలకూ ఎమోజీల వాడకం
తల్లిదండ్రులారా జరభద్రం: పుణె పోలీసులు
ఎమోజీ అంటే?
స్మైలీ, హార్ట్, థమ్సప్.. చాటింగుల్లో వాడే ఈ గుర్తులన్నింటినీ కలిపి మనం సింపుల్‌గా ఒక్కమాటలో ఎమోజీలు అనేస్తాం. ఇంతకీ ఎమోజీ(Emojis) అమ్మో.. బొమ్మ అంటే ఏమిటి? జపనీస్ భాషలో ‘మోజీ’ అంటే అక్షరం లేదా క్యారక్టర్ అని అర్థం. ‘ఈ’ అంటే చిత్రం. ఎమోజీ అంటే.. బొమ్మతో కూడిన పదం అని అర్థం. ఇంగ్లిష్‌లో దీన్ని ఎమోటికాన్‌గా వ్యవహరిస్తారు. ఎమోషన్ (భావోద్వేగం)తో కూడిన ఐకాన్ అని దీని అర్థం.
ఎమోజీల సృష్టికర్త ఎవరు?
ఈ ఎమోజీల రూపకర్త ఎవరు? గూగుల్(Google) చేస్తే ఈ ప్రశ్నకు సమాధానంగా జపాన్‌కు చెందిన షిగెటకా కురిటా పేరు వినిపిస్తుంది. ఈయన జపాన్‌లో సుప్రసిద్ధ ఇంటర్‌ఫేస్ డిజైనర్(Interface designer). జపనీస్ టీనేజర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ‘ఎన్టీటీడొకొమో’ సంస్థ 1999లో అభివృద్ధి చేసిన పేజర్లలో.. ఎమోజీలను తయారుచేశారు. అందుకే ఎమోజీల సృష్టికర్తగా ఈయన పేరే ప్రముఖంగా వినపడుతుం ది. కానీ, డొకొమో కన్నా రెండేళ్ల ముందే.. 1997లోనే జపాన్(Japan)కే చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కంపెనీ ఎమోజీ సెట్‌ను విడుదల చేసింది. అప్పట్లో ఆ సంస్థను ‘జే-ఫోన్’గా వ్యవహరించేవారు. అది1997లో తొట్టతొలి ఎమోజీ ఫోన్ ‘స్కైవాకర్ డీపీ 211 ఎస్‌డబ్ల్యూ’ను విడుదల చేసింది. అందులో 90 ఎమోజీ క్యారెక్టర్లున్నాయి. ఆ తర్వాతే కురిటా ఎమోజీలు బహుళ ప్రాచుర్యం పొందాయి.
ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కలిపి ఎన్ని ఉంటాయి? ప్రపంచ భాషల కేటలాగ్ రూపొందించే ‘ఎత్నోలోగ్’ వెబ్‌సైట్ ప్రకారం జూలై 25 నాటికి అన్ని దేశాల్లోనూ కలిపి గుర్తింపు పొందిన భాషలు 7,168. లిపి లేని, గుర్తింపునకు నోచుకోని భాషలు ఇంకెన్నో! ఈ భాషలతో ఉన్న ఒకే ఒక సమస్య.. ప్రతి భాషా దాన్ని మాట్లాడేవారికి తప్ప మిగతావారికి తెలియదు. నేర్చుకుంటే తప్ప ఇతరులకు అర్థం కాదు. కానీ.. ఈ సమస్య అంతగా లేని భాష.. ప్రపంచంలో దాదాపు అందరికీ అర్థమయ్యే భాష.. పుట్టి ఇంకా మూడు దశాబ్దాలు కూడా కాని భాష ఒకటి ఉంది. అదే.. ఎమోజీ భాష! సామాజిక మాధ్యమాల్లోనూ, వాట్సాప్(Whatsapp) వంటి మెసెంజర్లలోనూ.. ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కువగా వాడుతున్న భాష ఇది! అవతలి వ్యక్తి చెప్పిన జోక్‌కో.. రాసిన వ్యాసానికో.. మనం చాటభారతమంత రిప్లై ఇవ్వాల్సిన పని లేదు. ‘స్మైలీ (నవ్వుతున్న ముఖం)’ ఎమోజీనో.. ‘హార్ట్ (ప్రేమకు గుర్తుగా హృదయం)’ ఎమోజీనో.. వారు చెబుతున్నదానితో ఏకీభవిస్తున్నట్టు ‘థమ్సప్’ ఎమోజీనో పెడితే చాలు మన భావం వారికి అర్థమైపోతుంది. కానీ.. ఇటీవలికాలంలో ఈ ఎమోజీల భాషతోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి! ఎమోజీల దెబ్బకు కోర్టులకు కొత్త కొత్త చిక్కులతో కేసులూ వస్తున్నాయి!
(సెంట్రల్ డెస్క్): పేరెందుకుగానీ.. అనగనగా కెనడాలో ఒక రైతు. అవిసె గింజలు పండిస్తుంటాడు. 2021లో.. ఒక కొనుగోలుదారు ఆ రైతుకు ఫోన్ చేసి 86 టన్నుల అవిసెగింజలు కావాలని అడిగాడు. ఆ తర్వాత వాట్సాప్(Whatsapp)లో దీనికి సంబంధించిన ఒప్పందపత్రాన్ని కూడా పంపాడు. దాని చివర్లో.. ‘ఈ కాంట్రాక్ట్‌ను ఆమోదిస్తే ఆ విషయాన్ని ధ్రువీకరించండి’ అనే వాక్యం ఉంది. ఆ వాట్సాప్ మెసేజ్‌కు సదరు రైతు.. బొటనవేలు పైకెత్తినట్టుగా ఉండే ‘థమ్సప్’ ఎమోజీ('Thumsup' Emoji)తో సమాధానం ఇచ్చాడు. ఆ ఎమోజీని చూసి కొనుగోలుదారు ఈ ఒప్పందం ఖరారైనట్టే అనుకున్నాడు. కానీ.. ఎంతకీ సరుకు అందకపోవడంతో కోర్టుకెళ్లాడు. రైతేమో.. ఆ కొనుగోలుదారు పంపిన మెసేజ్ అందిందని చెప్పడానికి ఆ ఎమోజీ పెట్టానన్నాడు. ఒప్పందంపై తాను సంతకం చేయలేదు కాబట్టి దానికి తాను అంగీకరించినట్టు కాదని వాదించాడు. కానీ.. రైతు వాదనను కోర్టు ఆమోదించలేదు. థమ్సప్ సింబల్ పెట్టడమంటే ఆ కాంట్రాక్టుకు ఒప్పుకొన్నట్టేనని.. దాని ప్రకారం సరుకు పంపనందుకు 82,000 కెనడియన్ డాలర్ల జరిమానా కట్టాల్సిందేనని తీర్పునిచ్చింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.51 లక్షలు! డిక్షనరీ డాట్ కామ్ నిర్వచనం ప్రకారం.. ఎమోజీ అంటే డిజిటల్ కమ్యూనికేషన్స్‌లో మన ఆమోదాన్ని, ప్రోత్సాహాన్ని తెలిపేందుకు వాడే సాధనం. ఈ నిర్వచనం ఆధారంగానే కెనడా జడ్జి రైతుకు అంత భారీ జరిమానా వేశారు. థమ్సప్ ఎమోజీని పెట్టడం అంటే సంతకం పెట్టడం (డిజిటల్ సిగ్నేచర్)తో సమానమేనని తీర్పులో కూడా రాశారు. ఇలాంటిదే మరో ఉదాహరణ.. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నట్టు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడు. దానికి ఒక వ్యక్తి స్పందించాడు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, చాటింగ్‌లు జరిగాయి. ఇంటిని అద్దెకు తీసుకోవాలనుకున్న వ్యక్తి.. చాటింగ్ చేస్తున్నప్పుడు థమ్సప్ గుర్తు, షాంపేన్ సీసా, డాన్సింగ్‌గర్ల్ వంటి ఎమోజీలు పెట్టాడు. అతడు పెట్టిన ఈ బొమ్మలన్నింటినీ చూసిన ఇంటి యజమాని.. తన ఇల్లు అతడు అద్దెకు తీసుకుంటాడని భావించి ఆన్‌లైన్‌లో ఆ ప్రకటన తీసేశాడు. తీరా ఇతగాడు ఆ ఇంటిని అద్దెకు తీసుకోలేదు. దీంతో యజమాని కోర్టుకెళ్లాడు. కోర్టు వారిద్దరి చాటింగ్ చూసి.. ప్రతివాది పెట్టిన ఎమోజీలు ఇంటి యజమానిలో ఆశలు రేకెత్తించాయని, కాబట్టి అతడికి 8000 షెకెల్స్ (మన కరెన్సీలో దాదాపు రూ.1.72 లక్షలు) జరిమానా, దాంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.50 వేల దాకా చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది.
కొత్త టెక్నాలజీలు వచ్చిన కొద్దీ కొత్త కొత్త సమస్యలు కోకొల్లలుగా పుట్టుకొస్తాయనడానికి కొన్ని ఉదాహరణలివి! చూడ్డానికి చిన్నగా కనిపించే ఎమోజీలు ఎంత పనిచేస్తాయో చెప్పడానికి ఈ రెండే కాదు.. ఇంకా చాలా ఉదాహరణలున్నాయి. 2015లో ఫ్రాన్స్‌కు చెం దిన ఒక వ్యక్తి తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌కు తుపాకీ ఎమోజీని పంపినందుకు.. స్థానిక కోర్టు 3 నెలల జైలు శిక్ష, 1000 యూరోల జరిమానా (దాదాపు రూ.90 వేలు) వేసింది. తుపాకీ ఎమోజీని పంపడమంటే చంపుతానని బెదిరించడమేనని స్పష్టం చేసింది. ఆ దేశంలో ఒక ఎమోజీకి సంబంధించిన తొలి కేసు ఇదే. 2017లో న్యూజిలాండ్‌లో ఒక వ్యక్తి తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను ఫేస్‌బుక్‌లో దూషిస్తూ.. ఒక ఏరోప్లేన్ ఎమోజీని పెట్టాడు. అంటే.. వెంటనే వచ్చి ఆమెకు హాని కలిగిస్తానని దాని అర్థం. దీనికి జడ్జి ఎనిమిది నెలల జైలు శిక్ష వేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఒక వ్యక్తి ఇన్‌స్టాలో హైహీల్స్, మనీ బ్యాగ్ ఎమోజీలను పెట్టి ‘టీమ్ వర్క్ ఈజ్ డ్రీమ్ వర్క్’ అనే మెసేజ్ పోస్ట్ చేసినందుకు.. పోలీసులు అతడిపై వ్యభిచార నిర్వాహకుడిగా అభియోగం నమోదు చేస్తూ కేసు పెట్టారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎమోజీలకు సంబంధించిన కేసులు వెలుగుచూస్తున్నాయి. అమెరికాలో.. ఈ ఎమోజీలకు సంబంధించిన కేసుల సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2016లో అక్కడ ఈ తరహా కేసులు 26 నమోదు కాగా.. 2017లో 33, 2018లో 53 కేసులు నమోదయ్యాయి. 2019లో 94, 2020లో 124, 2021లో 154 కేసులు నమోదయ్యాయి.
ఫోరెన్సిక్ లింగ్విస్ట్‌ల దృష్టి..
అమెరికా వంటి దేశాల్లో.. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు, మాదకద్రవ్యాల విక్రేతలు ఈ (ఎమోజీ) తరహా సంకేత భాష వాడడం ఎప్పటి నుంచో ఉంది. గతంలో వారు కొన్ని రహస్య సంకేతాలను వాడేవారు. ఇప్పుడు ఎమోజీలకు మారారు. దీంతో ఫోరెన్సిక్ లింగ్వి్‌స్టలు ఎమోజీలపైన కూడా దృష్టి సారిస్తున్నారు. ఫోరెన్సిక్ లింగ్వి్‌స్టలంటే.. నేర పరిశోధనకు ఉపకరించే పత్రా లు, వాయిస్ రికార్డ్‌లలోని భాషను, భావాన్ని వాక్యనిర్మా ణం తీరును, వ్యాకరణం, యాస వంటివాటిని పరిశీలిం చి, విశ్లేషించేవారు. కేసుల విచారణలో వీరి పాత్ర కూడా కీలకం. ఎమోజీలపై కోర్టు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వీరి పాత్ర మున్ముందు కీలకం కానుంది.
ఎమోజీలతో డ్రగ్స్ దందా
తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త
భాష తెలియనివారికి మన భావం తెలియజేయడానికో.. భాష తెలిసినవారికి మన భావోద్వేగాన్ని ఒక్కముక్కలో చెప్పడానికో మాత్రమే కాదు.. ఎమోజీలను అసాంఘిక కార్యకలాపాలకు కూడా వాడుతున్నారు! ఇటీవలికాలంలో డగ్ర్స్ క్రయవిక్రయాలకు కొనుగోలుదారులు, విక్రేతలు.. ఇద్దరూ ఎమోజీలతోనే కోడ్ లాంగ్వేజ్‌లోనే సంభాషించుకుంటున్నారని పుణె పోలీసులు ఇటీవలే ప్రెస్‌మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. ఉదాహరణకు.. ఎవరికైనా హెరాయిన్ కావాలంటే సిరంజి గుర్తుతో అడుగుతారు. అదే ఎండీఎంఏ (దీన్నే ఎక్స్‌టసీ డ్రగ్‌గా వ్యవహరిస్తారు) కావాలంటే.. ట్యాబ్లెట్, చాక్లెట్ బొమ్మలు పెడతారు. ఇలా ఇంకా కొకైన్, మష్రూమ్స్, మెత్, జనాక్స్ తదితర మాదకద్రవ్యాలు ఒక్కోదానికీ ఒక్కో ప్రత్యేక కోడ్ ఉంటుంది. పిల్లల మొబైల్‌ఫోన్స్‌ను, వారి సోషల్ మీడియా ఖాతాలనూ తల్లిదండ్రులు తరచూ తనిఖీ చేయాలని.. ఎవరితోనైనా ఈ కింది ఎమోజీలతో సంభాషిస్తుంటే మాత్రం అప్రమత్తం కావాలని వారు సూచించారు. ఏయే మాదకద్రవ్యాల గురించి చెప్పడానికి ఏయే ఎమోజీలను వాడతారో వారు ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్ స్ర్కీన్ షాట్ ఇది...
2823 యూనికోడ్ కన్సార్షియం
ఇప్పటిదాకా రూపొందించిన ఎమోజీల సంఖ్య
Updated Date - 2023-07-27T04:47:14+05:30 IST