Rain: హైదరాబాద్‌లో వడగండ్ల వాన
ABN, First Publish Date - 2023-04-17T18:12:58+05:30
భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్ముకుంది. హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం అయింది.
హైదరాబాద్: భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్ముకుంది. హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా ఆకాశం మేఘావృతం అయింది. నగర వ్యాప్తంగా మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోయేవారు. అలాంటిది ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో హైదరాబాదీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నగరంలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన చంపాపేట్, మలక్‌పేట్, సైదాబాద్ (Malakpet Saidabad), చాదర్ఘాట్, కోఠి, చార్మినార్, బహదూర్పురాలో వడగండ్ల వాన పడింది. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) దగ్గర వడగండ్ల వాన దంచి కొట్టింది. మరోవైపు వర్షం (Rain) కురవడంతో నగర వాసులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. భానుడి భగభగను తట్టుకోలేక జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 10 దాటిందంటే బయటకు రావడానికే జంకుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకుపైగా పెరిగాయి. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు దగ్గరగా చేరాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితుల్లో వడగాడ్పులు వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. పలు పట్టణాల్లో ప్రధాన సెంటర్లు, రహదారులు సైతం జనసంచారం లేక వెలవెలపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో రోడ్లు ఆవిర్లు కక్కుతున్నాయి. ఎండ వేడిమి మరో మూడురోజులు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
Updated Date - 2023-04-17T18:12:58+05:30 IST