scorecardresearch

Ambedkar statue: అంబరమంత అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2023-04-14T02:20:23+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది.

Ambedkar statue: అంబరమంత అంబేడ్కర్‌

నేడే రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణ

మధ్యాహ్నం 2:30 గంటలకు ముహూర్తం

కేసీఆర్‌తో కలిసి పాల్గొననున్న ప్రకాశ్‌ అంబేడ్కర్‌

ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

ఒక్కో నియోజకవర్గం నుంచి 250 మంది తరలింపు

నెక్లెస్‌ రోడ్డులో సభ.. 50వేల మంది పాల్గొనే చాన్స్‌

అందరికీ ఐడీలు.. ఆహారం అందించేలా ఏర్పాట్లు

శత స్వర నీరాజనంతో అంబేడ్కర్‌ జీవిత చరిత్ర

హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. బౌద్ధ భిక్షువుల ప్రార్థనలతో ఆవిష్కరణ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆవిష్కరణ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెక్లె్‌సరోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అన్ని నియోజకవర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి 6 బస్సుల చొప్పున ఏర్పాటు చేసి.. ఒక్కో బస్సులో 45మందిని తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో బస్సుకు రక్షణగా ఒక అధికారి, ఒక కానిస్టేబుల్‌ ఉండనున్నారు.

బస్సుల్లో వచ్చే వారందరికీ వారందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. సుమారుగా 750 ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఇప్పటికే అధికారులకు సీఎం సూచించారు. ప్రజలకు ఎండ వేడిమి తగలకుండా నెక్లెస్‌ రోడ్డులో భారీ షామియానాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 40 నుంచి 50 వేల మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు అందించేందుకు లక్ష స్వీట్‌ ప్యాకెట్లు, లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు, లక్షన్నర నీళ్ల ప్యాకెట్లను సిద్ధం చేశారు. బస్సుల్లో వచ్చే జనానికి ఉదయం అల్పాహరం, మఽధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది. విగ్రహావిష్కరణ సమయంలో హెలికాప్టర్‌ నుంచి పూల వర్షం కురిపించనున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా శత స్వర నీరాజనం నిర్వహించనున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర నుంచి అంబేడ్కర్‌ కుటుంబ నేపథ్యం కలిగిన ప్రత్యేక బ్యాండ్‌ బృందం రానుంది. తెలంగాణ గోదాముల కార్పొరేషన్‌ చైర్మన్‌, సింగర్‌ సాయిచంద్‌, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

‘నీలి సూర్యుడికి నివాళి’ పేరుతో అంబేడ్కర్‌ జీవిత చరిత్రపై రాసిన పాటలను 100 మంది గాయకులు పాడనున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం దళితబంధు పథకం గురించి తెలిపే ‘కాఫీ టేబుల్‌ బుక్‌’ను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. కాగా, అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ, సభ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం పరిశీలించారు. కాగా, అంబేడ్కర్‌ మునిమనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ గురువారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకోగా, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు.

125 అడుగుల విగ్రహం.. దేశానికే గర్వకారణం: కేసీఆర్‌

భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ పోషించిన కీలక పాత్ర పోషించారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గమ్యాన్ని చేరుకోగలమనే తాత్వికతకు అంబేడ్కర్‌ జీవితమే నిదర్శనమని పేర్కొన్నారు. శుక్రవారం అంబేడ్కర్‌ జయంతి జరుపుకోనున్న నేపథ్యంలో ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. సమాజంలో నెలకొన్న అజ్ఞానాంధకారాలను చీల్చుకుంటూ జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన ప్రపంచ మేధావి అంబేడ్కర్‌ అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగానికి రూపమిచ్చి, అణగారిన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ స్ఫూర్తితో దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలుచేస్తోందని తెలిపారు. దళితులకు ఆర్థిక భరోసా ఇస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టి సమున్నతంగా గౌరవించుకున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం.. దేశానికే గర్వకారణమన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 3ను పొందుపరిచి, తెలంగాణ బాంధవుడిగా నిలిచిన అంబేడ్కర్‌కు.. ఇక్కడి సమాజం అర్పిస్తున్న ఘన నివాళి ఇదేనని పేర్కొన్నారు.

Updated Date - 2023-04-14T02:20:28+05:30 IST