Kavitha ED Row: కవితకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్
ABN, First Publish Date - 2023-03-17T12:30:49+05:30
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు సుప్రీంకోర్టులో (Suprem Court) ఎదురుదెబ్బ తగిలింది. తన పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలన్న కవిత (Kavitha) అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. ఈనెల 24నే విచారిస్తామని ఉన్నతన్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈడీ (ED) తనను విచారణకు పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా... 24న విచారిస్తామని కోర్టు తెలిపింది. నిన్నటి (మార్చి 16న) ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. దీంతో ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించింది. అయితే కవిత పిటిషన్‌ను తాము ముందు చెప్పిన విధంగా 24నే విచారిస్తామని.. దాంట్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈడీ అధికారులు మార్చి 20న సోమవారం తమ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కవితకు మరోమారు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణ జరిగేంత వరకూ ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ తోసిపుచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్లైని గురువారం ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టిన ఈడీ ఆయనను కవితతో కలిపి ముఖాముఖి ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది. దీంతో ప్రత్యేక న్యాయస్థానం అరుణ్ పిళ్లై కస్టడీని మార్చి 20 వరకు పొడిగించింది. మార్చి 20న ఉదయమే కవిత-అరుణ్ పిళ్లైల మధ్య ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి, వాస్తవాలు రాబట్టుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందని, కవిత ఈడీ దర్యాప్తు నుంచి తప్పించుకునే అవకాశాలు లేవని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కాగా, కవిత రెండు రోజుల క్రితమే ఈడీకి లేఖ రాసి సిద్ధంగా ఉంచారని, సాధ్యమైనంత వరకు ఈడీ దర్యాప్తు తప్పించుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.
Updated Date - 2023-03-17T12:49:28+05:30 IST