Vijayashanti: ఇప్పుడు టీపీసీసీలో జరుగుతున్నది అదే..
ABN, First Publish Date - 2023-01-05T14:14:55+05:30
ఏ రాజకీయ పార్టీ అయినా పటిష్టమైన సంస్థాగత నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే పది కాలాల పాటు ప్రజల్లో మనగలుగుతుందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.
హైదరాబాద్: ఏ రాజకీయ పార్టీ అయినా పటిష్టమైన సంస్థాగత నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే పది కాలాల పాటు ప్రజల్లో మనగలుగుతుందని బీజేపీ నేత విజయశాంతి (BJP Leader Vijayashanti) అన్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.... భారతీయ జనతా పార్టీలో జరిగేది ఇదే అని చెప్పుకొచ్చారు. కింది స్థాయిలోని కార్యకర్తలు కూడా తాము అధిష్టానంతో కలసి జాతి నిర్మాణానికి తోడ్పడుతున్నామనే భావనతోనే పని చేస్తారన్నారు. కానీ.. 125 ఏళ్లకు పైబడిన చరిత్రతో ఒకప్పుడు కళకళలాడి నేడు వెలవెలబోతున్న కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో... పైస్థాయి నాయకత్వంతో పని చేసే రెండవ స్థాయి నాయకత్వంతో తప్ప ఆ కింది స్థాయుల నాయకులు, అట్టడుగు స్థాయిలోని సామాన్య కార్యకర్తలతో సంబంధాలుండవన్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే... పనిచేస్తూ, పార్టీకి గుర్తింపు తెస్తూ... పార్టీతో పాటు తామూ ఎదిగేందుకు శ్రమించే నేతల్ని కిందికి లాగిపడెయ్యడానికి నిరంతరం కుట్రలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. ఇప్పుడు టీపీసీసీలో జరుగుతున్నది అదే అని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి (TPCC Chief Revanth Reddy) ఎదురవుతున్న పరిస్థితులు చూసినా... మాణిక్కం ఠాకూర్ (Manikkam Thakur) మారినా... మాణిక్ రావు ఠాక్రే (Manik Rao Thackeray) వచ్చినా వ్యవస్థ ధోరణి విధాన కార్యాచరణ సరిగా చేసుకోగలిగినప్పుడే ఫలితాలకై ప్రయత్నం కొంతైనా సానుకూలం అయ్యే అవకాశాలు ప్రజల నుండి ఏర్పడతాయన్నది సహేతుకమైన వాస్తవమని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్ (TRS) లాంటి దుర్మార్గ, అవినీతి, నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వంతో కొట్లాడే ఎవరైనా... బీజేపీ లెక్క తెలంగాణలో గెలవగలిగే పరిస్థితిలో లేకున్నా కూడా... ఆయా పార్టీల స్వంత మనుగడ దృష్ట్యా ఈ అంశం పరిశీలనలోకి తీసుకోవడం అవసరమేమో ఆలోచించాలి అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
Updated Date - 2023-01-05T14:14:56+05:30 IST