BRS MLAs Poaching Case: హైకోర్టు తీర్పుపై సుప్రీమ్‌కు వెళ్లాలని సిట్ నిర్ణయం
ABN, First Publish Date - 2023-02-06T19:28:16+05:30
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు(BRS MLAs Poaching Case)లో సీబీఐ అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ప్రశ్నించే అవకాశం ఉంది.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు(BRS MLAs Poaching Case)ను సీబీఐ(CBI)కి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) సమర్థించింది. దీంతో తెలంగాణ సర్కారుకు హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు సీబీఐ అధికారులు దర్యాప్తులో భాగంగా ప్రగతి భవన్ వెళ్లే అవకాశాలున్నాయి. వాస్తవాల కోసం సీబీఐ అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ప్రశ్నించే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో తమను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గత ఏడాది అక్టోబర్ 26న ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక) ఆరోపించారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రామచంద్రభారతి, సింహయా జీ, నందకుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడంలేదని, సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలని హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలైయ్యాయి. అన్ని పిటిషన్ లను కలిపి విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి న్యాయమూర్తి ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తీర్పు ప్రకటించారు.
సింగిల్ జడ్జి బెంచ్ గత ఏడాది డిసెంబర్ 26న సిట్‌ను రద్దు చేసి, కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 4న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాతపూర్వక వాదనలు సమర్పించేందుకు జనవరి 30 వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ఈరోజు కేసు విచారణ జరిపిన న్యాయస్థానం సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పును తప్పు బట్టలేమని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టీ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈకేసులో 111 పేజీలతో హైకోర్టు తీర్పు వెలువరించింది. కేసులో నిందితులైన రామచంద్రభారతి, సింహయా జీ, నందకుమార్ హక్కులను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకున్నట్లు డివిజన్ బెంచ్ పేర్కొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్‌ను పూర్తిగా సమర్థిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సుప్రీం కోర్టు ఇచ్చిన రామ్ కిషన్ ఫోజి తీర్పును ప్రస్తావించింది ధర్మాసనం. లెటర్స్ పేటెంట్ క్లాస్ 15 ప్రకారం కేస్ పూర్తిగా క్రిమినల్ జూరిస్‌డిక్షన్ పరిధిలోకి వస్తుందని తీర్పులో పేర్కొంది. మెరిట్స్‌లోకి వెళ్లకుండా క్రిమినల్ జూరిస్‌డిక్షన్ పైనే తీర్పు ప్రకటించింది.
అనంతరం అడ్వకేట్ జనరల్ తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని ధర్మాసనాన్ని కోరగా న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర హైకోర్ట్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సిట్ నిర్ణయించింది. మరోవైపు ఏక్షణమైన సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఒకసారి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక పైలెట్ రోహిత్‌రెడ్డి(Pilot Rohith Reddy)ని, గువ్వల బాలరాజును, బీరం హర్షవర్ధన్‌రెడ్డిని, రేగా కాంతారావును ప్రశ్నించనుంది. ప్రగతి భవన్ వేదికగా కథ అంతా నడవడంతో కేసులో ఆధారాలు ప్రగతి భవన్‌కు ఎలా చేరాయనే విషయంపై సీబీఐ నిగ్గు తేల్చనుంది. ముఖ్యమంత్రికి ఎవరు, ఎప్పుడు ఎందుకు అందజేశారు. దర్యాప్తు కొనసాగుతుండగానే విలేకరుల సమావేశం పెట్టి మరీ పూర్తి వివరాలు బయటపెట్టడంపై సీబీఐ ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.
Updated Date - 2023-02-06T19:40:07+05:30 IST