Congress Chalo Rajbhavan: హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ ప్రదర్శన.. అడ్డుకున్న పోలీసులు... అరెస్ట్
ABN, First Publish Date - 2023-03-15T13:27:00+05:30
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణుల (Congress Leaders)ను పోలీసులు అడ్డుకున్నారు. దేశంలో ఆదానికి ప్రధాని మోదీ దేశ సంపద దోచి పెట్టి అక్రమాలకు పాల్పడిన అంశాలపై, ఆదాని షేర్ల పతనం, అంశాలపై పార్లమెంటరీ కమిటీ వేయాలని, క్రోని కాపాటలిజంకు వ్యతిరేకంగా ఏఐసీసీ (AICC) ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో చలో రాజభవన్ (Chalo Raj Bhavan)కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఛలో రాజ్‌భవన్‌కు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు బయలు దేరారు. వారిని ఖైరతాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఛలో రాజ్‌భవన్‌కు బయలుదేరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అటు రాజ్‌భవన్ వద్ద మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఈ దేశంలోని ఆస్తులు ఒక్కరిద్దరికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశ సంపద దేశ ప్రజలకు చెందాలని అన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేసిందని... కానీ మోదీ వచ్చాక ఒక్కరిద్దరికే కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దేశం ప్రమాదంలో పడిందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ దేశం కోసం పాదయాత్ర చేశారన్నారు. హిడెన్ బర్గ్‌లో వచ్చిన కథనం ప్రపంచాన్ని షేక్ చేసిందని.. ఈ దేశం నుంచి మోదీని వదిలించుకోవాలని అన్నారు. అదానీపై మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తమ పోరాటం ప్రజల కోసం, ఈ దేశం సంపద రక్షణ కోసమని స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి తమ నిరసన తెలపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కాంగ్రెస్ నేతలను మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. పోలీసులు అడ్డుకున్నా ఛలో రాజ్‌భవన్‌కు వెళతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఛలో రాజ్‌భవన్ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, చిన్నారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, నాయకులు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సంగిశెట్టి జగదీష్, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-15T13:27:00+05:30 IST