MLC KAVITHA: ధర్మమే జయిస్తుంది
ABN, First Publish Date - 2023-03-10T03:07:54+05:30
‘‘ఢిల్లీ మద్యం విధాన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాను.
ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటా.. దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తా
సత్యం, ధర్మం, న్యాయం నావెంటే ఉన్నాయి
సిల్లీ అంశాలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించాలి?
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మోదీ కంటే ముందు ఈడీ
ఇది బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మోడస్ ఆపరెండీ
మోదీ ఇంజన్, అదానీ ఇంజన్.. ఇదే డబుల్ ఇంజన్
న్యూఢిల్లీ, మార్చి 9 (ఆంరఽధజ్యోతి): ‘‘ఢిల్లీ మద్యం విధాన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాను. సత్యం, ధర్మం, న్యాయం నా వెంటే ఉన్నాయి. మహా భారత యుద్ధం జరుగుతున్న సమయంలో దుర్యోధనుడు ఆశీర్వాదం తీసుకోవడానికి తన తల్లి గాంధారి దగ్గరికి వెళతాడు. దుర్యోధనుడి వైపు తప్పు ఉన్నప్పుడు ఆమె ఎలా ఆశీర్వదిస్తుంది? అందుకే, ‘యతో ధర్మః తతో జయః’ (ధర్మం ఎవరి వైపు ఉంటుందో వాళ్లు విజయం సాధించుగాక) అని ఆశీర్వదించింది. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను. జైలులో పెట్టినంత మాత్రాన శ్రీకృష్ణ భగవాన్ జన్మను ఎవరూ ఆపలేకపోయారు. వనవాసం చేసినా శ్రీరాముడి బలం తగ్గలేదు. తాము భగవంతుడి కంటే ఎక్కువని, అన్ని సంస్థలను నియంత్రిస్తామని ఎవరైనా అనుకుంటే సహజ ఽధర్మ సూత్రం ముందుకొస్తుంది’’ అని సీఎం కేసీఆర్ తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ దీక్ష చేయాలని తలపెట్టిన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో గురువారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘నిరాహార దీక్ష పదో తేదీన చేస్తామని ప్రకటించాం. 9న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. దీక్ష నేపథ్యంలో 16న విచారణకు హాజరవుతానని విజ్ఞప్తి చేశాను.
చివరికి 11న విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు కోరారు. అందుకు అంగీకరించాను. దర్యాప్తులో అంత తొందరపాటు ఎందుకో అర్థమవ్వడం లేదు’’ అని తప్పుబట్టారు. ఈడీ సహా దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించాలనుకుంటే వారి నివాసానికి వెళ్లి విచారణ జరపాలని కోర్టు తీర్పులు ఉన్నాయని, ఇదే విషయాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్లామని, కానీ, కార్యాలయానికి రావాల్సిందేనని తనకు స్పష్టం చేశారని కవిత తెలిపారు. ‘‘నేను రాజకీయ నాయకురాలిని. పార్టీ నాకు అండగా ఉంది. ఈడీ విచారణకు రాగలుగుతా. కానీ, ఏదో కేసులో విచారణ కోసం ఎక్కడో గ్రామాల్లో ఉండే ఒక సామాన్య మహిళను ఇలా పిలిస్తే పరిస్థితి ఏమిటి? కరోనా సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూసి మందులు ఇచ్చారు. మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు విచారించరు?’’ అని ఆమె ప్రశ్నించారు. పోలీసులు, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు మహిళలను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించేలా చట్టం రావాలని, ఈ అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. మద్యం కుంభకోణంపై వస్తున్న ఆరోపణల గురించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘సిల్లీ అంశాలపై ఎందుకు స్పందించాలి?’’ అని బదులిచ్చారు.
దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తా
ఈడీ దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తానని కవిత ప్రకటించారు. ‘జూన్ నుంచి కేంద్రం తరచూ దర్యాప్తు సంస్థలను తెలంగాణకు పంపిస్తోంది. ఎందుకంటే డిసెంబరులో ఎన్నికలు ఉన్నందునే. బీజేపీ మాడస్ ఆపరెండి ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడికి మోదీ కన్నా ముందు ఈడీ వెళ్తుంది. ఈడీ సహా ఏ దర్యాప్తు సంస్థ అయినా సమన్లు జారీ చేసిందంటే నేరుగా మోదీ ఇచ్చినట్లే. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోంది. రాష్ట్రంలో 500కుపైగా వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. వందలాది సీబీఐ సోదాలు జరిగాయి. 200 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. 500-600 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ పిలిచి బెదిరించింది. నాపైనే కాకుండా మా పార్టీకి చెందిన 15-16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను టార్గెట్ చేసి వివిధ కేసుల్లో దర్యాప్తు సంస్థలు పిలుస్తున్నాయి’’ అని విమర్శించారు. బీజేపీ మిత్రపక్షాలు, వ్యాపార సంస్థలపై ఎటువంటి సోదాలు జరగవని, అదానీతోపాటు అనేక మందిపై దర్యాప్తులు, విచారణలు జరగబోవని తప్పుబట్టారు. తెలంగాణ, దేశ ప్రజలకు ఏం చేశామో చెప్పి వారి మనసులు గెలిచి ఎన్నికల్లో గెలవాలని మోదీ, బీజేపీ నేతలకు కవిత సూచించారు.
అంతే తప్ప, ఈడీని అడ్డంపెట్టుకొని అధికారంలోకి రావాలని చూడడం సరికాదని, ఇలా 9 రాష్ట్రాల్లో బీజేపీ చేసిందని, తెలంగాణలోనూ ఇలానే అధికారంలోకి రావడానికి ప్రయత్నించి విఫలమైందని వివరించారు. ఈడీతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కానీ, తాము భయపడేవాళ్లం కాదని స్పష్టం చేశారు. తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, మొత్తం వ్యవస్థతో తాను పోరాడాల్సి ఉందని అన్నారు. మోదీ, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. ‘‘ఎక్కడ పెట్టుబడులు పెట్టమంటే అక్కడ పెడుతుండడం, ఎక్కడకు వెళ్లి దర్యాప్తు చేయమంటే అక్కడ దర్యాప్తు చేస్తున్నందునే ఈడీ డైరెక్టర్, సెబీ చైర్మన్, ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తున్నారు!? ఆర్మీలో దాదాపు 3.5 లక్షల ఖాళీలు ఉన్నాయి.. తొలుత అగ్నివీర్‌ల పదవీ కాలాన్ని పొడిగించాలి’’ అని కవిత సూచించారు. ‘‘విపక్షాలపై ఈడీ యుద్ధం సరే. కానీ, సామాన్య ప్రజలపై ధరల యుద్ధం చేస్తున్నారు కదా! దానికి ఎన్నికల్లో ఫలితం కనిపిస్తుంది. మాలాంటి వారిని వేధిస్తే మీకు ఏం వస్తుంది? మేం ఎదుర్కొంటాం. మరి, బీఎల్ సంతోష్ ఎందుకు భయపడుతున్నారు? స్టేలు తెచ్చుకోకుండా సిట్ ముందు హాజరవ్వాలని ఆయనకు చెప్పండి’’ అని అన్నారు. తాము వెళ్లాల్సిన సమయంలో కోర్టుకు వెళతానని చెప్పారు. జీడీపీ, దేశ అభివృద్ధిపై పార్లమెంటులో మోదీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వన్ నేషన్ - వన్ ఫ్రంట్ సర్కారుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-03-10T04:04:07+05:30 IST