Etala Rajender: ఈటల సంచలన ప్రకటన! బీజేపీలో తీవ్ర కలకలం
ABN, First Publish Date - 2023-11-11T03:41:28+05:30
ఈ నిర్ణయంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు గాని, అంతర్గత తగాదాలు గాని లేనేలేవన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు రెండు సార్లు ఆశీర్వదించారని.. కానీ, ఆయన దాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.
బీజేపీ గెలిస్తే నేనే సీఎం!
ఈ మేరకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు
ఈ నిర్ణయంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు లేవు
సంచలన ప్రకటన చేసిన బీజేపీ నేత ఈటల
కేసీఆర్ ప్రభుత్వ ఓటమి ఖాయమని జోస్యం
హైదరాబాద్, నవంబరు 10: తనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని మాజీ మంత్రి, బీజేపీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. వివిధ కులాలకు చెందిన 36 మంది ప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారని.. ఈటల ఓ ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ప్రధానికి తెలుసన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు తెలంగాణలో కానీ ఓబీసీ నాయకుడు సీఎం కాలేదని.. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఈటలజీని సీఎంను చేస్తానని.. బీసీ ప్రతినిధుల సమావేశంలో మోదీ స్పష్టం చేశారని ఆయన వివరించారు.
తెలంగాణ ఉద్యమ నేపథ్యం, వివిధ శాఖలకు మంత్రిగా ప్రాతినిధ్యం, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత తనకుందని.. ఈ ట్రాక్ రికార్డునంతటినీ పరిశీలించాకే ప్రధాని ఈ మేరకు హామీ ఇచ్చారని ఈటల అన్నారు. ఈ నిర్ణయంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు గాని, అంతర్గత తగాదాలు గాని లేనేలేవన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు రెండు సార్లు ఆశీర్వదించారని.. కానీ, ఆయన దాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమంగా కొల్లగొట్టిన సొమ్మును ఎన్నికల్లో వెదజల్లి గెలవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అయినప్పటికీ ఈసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం నూటికి నూరు శాతం ఖాయమని ఈటల జోస్యం చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా తన వెనకే ఉన్నారని.. నిబద్ధత, గట్టి సంకల్పం కలిగిన వారి వల్లే తాను వరుస విజయాలు సాధించగలుగుతున్నానని అన్నారు.
Updated Date - 2023-11-11T11:52:39+05:30 IST