Gaddar Death: పొద్దు వాలిపోయింది
ABN, First Publish Date - 2023-08-07T02:33:58+05:30
‘‘పొడుస్తున్న పొద్దు మీద’’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు. బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ కన్నుమూత
ఛాతీనొప్పితో ఇటీవల ఆస్పత్రికి!
అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస
కేటీఆర్, పవన్, ప్రముఖల నివాళి
భౌతికకాయం ఎల్బీ స్టేడియానికి
నేటి మధ్యాహ్నం వరకు అక్కడే
అనంతరం అల్వాల్‌లోని ఇంటికి
మహాబోది స్కూల్లో అంత్యక్రియలు
అధికారిక లాంఛనాలతో నిర్వహణ
గద్దర్ మృతికి అసెంబ్లీ సంతాపం
ఆయన..
హా.. అంటే నవ నాడుల్లో ప్రకంపనం!
గొంతెత్తి పాడితే అణువణువు ఉత్తేజం!
ఆ విప్లవ గీతం యువతకు స్ఫూర్తిమంత్రం!
ఎలుగెత్తే ప్రతి అక్షరం ఓ ధిక్కార స్వరం!
పెత్తందారులను వణికించిన పాటల అస్త్రం!
తెలంగానం వినిపించిన చైతన్య స్వరం!
ఆ ధిక్కార స్వరం మూగవోయింది! ఆ ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసిపోయింది! ఆ పాటల గర్జన ఆగిపోయింది! విప్లవ వీరుడు.. వాగ్గేయకారుడు గద్దర్ అస్తమించారు!
ఆస్పత్రిలోని ఐసీయూలో అంపశయ్యపైనా పాటనే శ్వాసించి తుది శ్వాస విడిచారు!
హైదరాబాద్ సిటీ/బర్కత్‌పుర/అమీర్‌పేట/అఫ్జల్‌గంజ్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘‘పొడుస్తున్న పొద్దు మీద’’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు. బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది. భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసింది. పెత్తందారీల పాలిట బందూకుగా.. అణగారిన వర్గాలకు బాసటగా నిలిచిన గుమ్మడి విఠల్(Gummadi Vitthal) అలియాస్ గద్దర్( Gaddar) (74) కన్నుమూశారు. ఛాతీ నొప్పితో జూలై 20న హైదరాబాద్ అమీర్‌పేట(Hyderabad Ameerpet)లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి(Apollo Spectra Hospital)లో చేరిన ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆరోగ్యం కుదుటపడింది.. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారని భావిస్తుండగా.. అభిమానులను విషాదంలో ముంచెత్తుతూ లోకం వీడారు. గద్దర్‌కు గురువారం బైపాస్ సర్జరీ(Bypass surgery) చేశామని అపోలో స్పెక్ట్రా సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ దాసరి ప్రసాదరావు(Cardiologist Dr. Dasari Prasada Rao) తెలిపారు. గద్దర్ చాలాకాలంగా ఊపిరితిత్తులు, మూత్రాశయ సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయని, పలు అవయవాలు విఫలమవడం, వయోభార సమస్యలతో మృతి చెందారని ప్రకటించారు. బైపాస్ సర్జరీ అనంతరం గద్దర్ కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్య(Lungs problem) ఉత్పన్నమైందని డాక్టర్ ప్రసాదరావు తెలిపారు. చికిత్స సమయంలో కూడా గద్దర్ పాటలు (Gaddar songs) పాడి వినిపించారని చెప్పారు. ఆదివారం ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారిందని.. తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు.
భౌతికకాయం తరలింపులో గందరగోళం
గద్దర్ భౌతిక కాయం తరలింపులో ఒకింత గందరగోళం ఏర్పడింది. తొలుత అల్వాల్‌లోని ఇంటికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. ఆస్పత్రి వద్దకు భారీగా అభిమానులు చేరుకోవడం.. ఇంటి వద్ద తగిన స్థలం లేకపోవడంతో నిర్ణయం మార్చుకున్నారు. పలువురి సూచనల మేరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు తీసుకెళ్లాలనుకున్నారు. ఇంతలో గద్దర్ ఆడిపాడిన, ఆయనకు ఎంతో ఇష్టమైన నిజాం కాలేజీ గ్రౌండ్‌కు తీసుకెళ్తే బాగుంటుందని కొందరు కళాకారులు చెప్పడంతో ఆ దిశగానూ ఆలోచన చేశారు. అక్కడా అభిమానులను అదుపు చేయడం కష్టమని, చివరకు ఎల్బీ స్టేడియానికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. సాయంత్రం. 5.30కు స్టేడియంకు తీసుకువచ్చారు. కాగా, ఎల్బీ స్టేడియంలో గద్దర్ మృతదేహాన్ని ఉంచేందుకు ప్రభుత్వం తొలుత అంగీకరించ లేదని కథనాలు వచ్చాయి. దీంతోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ చొరవ చూపి స్టేడియం గేట్లు తీసుకుని లోపలకు వెళ్లి ఏర్పాట్లు చేశారని తెలిసింది. మరోవైపు గద్దర్ భౌతిక కాయాన్ని మైదానం మధ్యలో వేదిక నిర్మించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. కవులు, కళాకారులు, వివిధ పార్టీ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. గద్దర్ భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో ఉంచనున్నారు. 2 గంటల తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఎల్బీ స్టేడియం నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా, జగ్జీవన్‌రామ్ విగ్రహం వీదుగా గన్‌పార్క్ వైపు సాగనుంది. అమరవీరుల స్థూపం, అంబేడ్కర్ విగ్రహం వద్ద కాసేపు ఉంచుతారు. అనంతరం అల్వాల్ భూదేవినగర్‌లోని నివాసానికి తరలిస్తారు. గద్దర్ స్థాపించిన మహాబోది పాఠశాలలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అల్లుడు డాక్టర్ కె.శ్రీకాంత్ ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు.
కేటీఆర్, ప్రముఖుల నివాళి
ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయానికి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ నేతలు ఈటల, డీకే అరుణ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ‘‘ఆంధ్రజ్యోతి’’ సంపాదకులు కె.శ్రీనివాస్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రజా గాయకులు అందెశ్రీ తదితరులు నివాళులర్పించారు.
అసెంబ్లీ సంతాపం
గద్దర్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, గద్దర్ మృతికి అసెంబ్లీలో ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. మంత్రి కేటీఆర్.. శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం తరపున సంతాపం తెలిపారు.
ఆస్పత్రికి నాయకులు, అభిమానులు
గద్దర్ మరణ వార్త తెలిసి అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. ప్రజా కవులు, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు ఆస్పత్రికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాకూర్, ఎమ్మెల్యే సీతక్క, సీనియర్ నేతలు వీహెచ్, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, అద్దంకి దయాకర్ తదితరులు ఆస్పత్రికి వచ్చారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దాసోజు శ్రవణ్ సైతం చేరుకున్నారు. కవులు, కళాకారులు అరుణోదయ విమలక్క, జయరాజ్ తదితరులు పాటలతో నివాళులర్పించారు. ఆ సమయంలో విప్లవ గేయాలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. గద్దర్ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించారు. స్టేడియంలో ఏర్పాట్లను రేవంత్ స్వయంగా పర్యవేక్షించారు.
Updated Date - 2023-08-07T03:22:21+05:30 IST