Hyderabad: సిటీలో డబుల్ డెక్కర్ మరింత ఆలస్యం
ABN, First Publish Date - 2023-04-01T09:15:51+05:30
నగర ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): నగర ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. గతేడాదే అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు ప్రకటించినా అది సాధ్యం కాలేదు. ఈ ఏడాది మే, జూన్ నాటికి ఎలక్ర్టిక్ బస్సులతో పాటు పది డబుల్ డెక్కర్ బస్సులు తీసుకు వస్తారని భావించినా అదీ అయ్యేలా కనిపించడం లేదు.
550 ఎలక్ర్టిక్ బస్సులతోపాటు 10 డబుల్ డెక్కర్ బస్సుల కోసం టీఎస్‌ఆర్టీసీ రెండు నెలల క్రితం టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయినా బస్సులు రోడ్లపైకి ఎప్పుడు తీసుకువస్తారనే విషయంపై అధికారులకే స్పష్టత లేదు. గతంలో 25 డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేసినా టెండర్ల ప్రక్రియకు ఆశించిన స్పందన లభించకపోవడంతో బస్సుల సంఖ్య 10కి తగ్గించారు. డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వస్తే పటాన్‌చెరు-కోఠి, జీడిమెట్ల-సీబీఎస్, అఫ్జల్‌గంజ్-మెహిదీపట్నం మార్గాల్లో నడపాలని ఆర్టీసీ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది.
2005 వరకు రోడ్లపై..
హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి డబుల్ డెక్కర్ బస్సులు తిరిగాయి. నాడు హైదరాబాద్ అందాలు, చారిత్రక కట్టడాలను ఈ బస్సుల నుంచి వీక్షిస్తూ ప్రయాణికులు ప్రత్యేక అనుభూతి పొందేవారు. నగరంలో సుమారు 100 వరకు డబుల్ డెక్కర్ బస్సులను గ్రేటర్ ఆర్టీసీ నడిపింది. డబుల్ డెక్కర్ బస్సులు రెండు కిలోమీటర్లు నడిచేందుకు లీటర్ డీజిల్ అవసరమయ్యేది. సాధారణ బస్సులతో పోల్చితే కేఎంపీఎల్ చాలా తక్కువగా ఉండేది. కాలక్రమంలో నష్టాలు అధికమవడంతో డబుల్ డెక్కర్ బస్సులను 2005 నాటికి పూర్తిగా నిలిపివేశారు.
రోడ్డెక్కని హెచ్‌ఎండీఏ బస్సులు..
ఈ-రేస్ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ మూడు డబుల్ డెక్కర్ బస్సులను 2023 జనవరిలో అందుబాటులోకి తెచ్చారు. ఖైరతాబాద్ నెక్లెస్2రోడ్‌లో ఈ-రేస్ సందర్భంగా ఒకటి, రెండు రోజులపాటు తిప్పిన డబుల్ డెక్కర్ బస్సులను ఆ తర్వాత పక్కన పెట్టారు. మరో మూడు డబుల్ డెక్కర్ బస్సులు రావాల్సి ఉందని ఆ బస్సులు కూడా వచ్చిన తర్వాత ఆరు బస్సులను గ్రేటర్‌లో తిప్పుతామని అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2023-04-01T09:16:07+05:30 IST