YSRTP Chief: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏకిపారేసిన షర్మిల
ABN, First Publish Date - 2023-08-15T11:46:33+05:30
వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారత పౌరులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence day Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారత పౌరులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ గొప్పదనమన్నారు. ఎన్నో కులాలు, మతాలు, ఎన్నో భాషలు ఇదే భారత దేశ సంపద అని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడే విధంగా లేకపోగా డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిలో బ్రిటిష్ వాళ్లు అనుసరించిన విధంగా సాగుతోందని విమర్శించారు. ఇటీవల మణిపూర్‌లో జరిగిన ఘటనలు భరతమాతకే అవమానమన్నారు. నెలల తరబడి లా అండ్ ఆర్డర్ నశించిపోయిందన్నారు. పోలీస్ స్టేషన్‌ల మీద దాడులు చేసి 3 వేల ఆయుధాలు దోపిడీ చేసి, 6 లక్షల రౌండ్స్ ఆఫ్ ఆమ్యునిషన్స్ దోపిడీ చేసి సామాన్య ప్రజల మధ్య భీభత్సాన్ని సృష్టించారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు.
60 వేల మంది నిర్వాసితులయ్యారని.. 222 చర్చిలను ధ్వంసం చేశారని.. మహిళలను రేప్ చేశారని.. ఇద్దరు మహిళలను నగ్నంగా పరేడ్ చేశారని.. ఇది భారత దేశం అవమానంతో తలదించుకునే సందర్భం కాదా? అంటూ నిలదీశారు. మతం పేరుతో కేంద్రం రాజకీయాలు చేయడం మానేసుకోవాలి... మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు మారాలని హితవుపలికారు. ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మ గాంధీ గారు అన్నారని.. అయితే ఈరోజు ఆ పరిస్థితి ఉందా? అని అడిగారు. మణిపూర్‌లో నేటికీ అత్యాచారాలు, మతం పేరుతో గొడవలు అలాగే కొనసాగుతున్నాయన్నారు. ఇంటర్ నెట్‌ను బంద్ చేసి మరీ ఆ గొడవలకు, లూటీకి పాల్పడుతున్నారంటే మరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించక ఎవరిని ప్రశ్నించాలని అన్నారు. భారత దేశ ప్రజలు ఏం చేయాలని షర్మిల నిలదీశారు.
ఆనాడు తెల్లదొరపాలిస్తే.. ఈనాడు నల్లదొర పరిపాలిస్తున్నాడు...
ఒక పక్క కేంద్రం అలా వ్యవహరిస్తుంటే .. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అదే దారని విమర్శించారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే స్వాతంత్ర్యం వచ్చిందని.. అలాగే ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. ప్రత్యేక తెలంగాణలో మహిళలకు గౌరవమే లేదన్నారు. ఎక్కడ చూసినా వైన్ షాపులు, బార్లు, పబ్బులు.. గుడులు బడుల కంటే వైన్ షాపులు, బెల్ట్ షాపులే ఎక్కువని మండిపడ్డారు. మహిళలకు భద్రత ఎక్కడి నుంచి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అర్ధరాత్రి కాదు కదా... పట్ట పగలు కూడా మహిళలు తిరిగే పరిస్థితి లేదన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులేమో బిడ్డల్ని బయటకు పంపాలంటే భయపడుతుంటే... మగపిల్లల తల్లిదండ్రులేమో పిల్లలు మద్యానికి బానిసలవుతున్నారని భయపడుతున్నారన్నారు. మరి తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా అంటూ ప్రశ్నలు కురిపించారు. తెలంగాణ రాకముందు కంటే ఈరోజు తెలంగాణలో మద్యం అమ్మకాలు.. పదింతలు పెరిగాయన్నారు. మద్యం అమ్ముకొని కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. 38 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి పరిపాలిస్తున్నారన్నారు. 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడిపితే పాలన అంటారా? దిక్కుమాలిన పాలన అంటారా? అని నిలదీశారు. లక్షల కోట్ల అప్పు తెచ్చినా ఒక్క హామీ నిలబెట్టుకోలేదన్నారు. కేసీఆర్ పాలనలో మ్యానిఫెస్టో అనే దానికే విలువే లేకుండా పోయిందన్నారు.
రుణమాఫీ అన్నారు.. 30 లక్షల మంది ఇంకా ఎదురుచూస్తునే ఉన్నారని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు అన్నారని.. 30 లక్షల మంది తమకు ఇల్లు లేదని అర్జీలు పెట్టుకున్నారన్నారు. కేసీఆర్ కట్టింది 25 వేలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇంటికో ఉద్యోగం అన్నారని.. బిస్వాల్ కమిటీ లక్షా 98 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే, కొత్త జిల్లాల ప్రకారం 3 లక్షల 85 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి.. మరి ఎన్ని చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంత వరకు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తెలంగాణ బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగానికి తగరా? అర్హులు కారా? కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారని ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్‌కు అని ప్రశ్నించారు. ఆనాడు బ్రిటిష్ వాళ్లు తెల్ల దొరలు పాలిస్తే .. ఈరోజు తెలంగాణలో మన నల్లదొర కేసీఆర్ ఒక దొరలాగే పరిపాలిస్తున్నారని విమర్శించారు. వాళ్లు దోపిడీ, ద్రోహం చేశారని.. ఈయన కూడా అదే చేస్తున్నారన్నారు. ఈ నియంత పాలన పోవాలన్నారు. కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-08-15T14:12:56+05:30 IST