Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో వెళుతుండగా ఈ ఆరు మెట్రో స్టేషన్ల సమీపంలో ఇలా అనిపించిందా..?
ABN, First Publish Date - 2023-06-23T18:11:11+05:30
ఈ ఫొటో హైదరాబాద్ మెట్రో రైలులోనిది. రైలు వేగానికి కోచ్‌లో తలుపు వద్ద క్లిప్ ఊడిపోయి ప్రమాదకరంగా తయారైంది. రెండు రేకులకు అదిమి పట్టి ఉండే క్లిప్ ఊడిపోయి రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
మెట్రో రైళ్ల నిర్వహణ అధ్వానం..
స్టేషన్ల నుంచి కోచ్‌ల మెయింటెనెన్స్ వరకూ గాలికి
పనిచేయని డిస్‌ప్లే బోర్డులు, ఊడిపోతున్న క్లిప్‌లు
ఈ ఫొటో హైదరాబాద్ మెట్రో రైలులోనిది. రైలు వేగానికి కోచ్‌లో తలుపు వద్ద క్లిప్ ఊడిపోయి ప్రమాదకరంగా తయారైంది. రెండు రేకులకు అదిమి పట్టి ఉండే క్లిప్ ఊడిపోయి రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైలు వేగానికి అటు ఇటు కదులుతుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. మెట్రో రైలు నిర్వహణలో ఎల్‌అండ్‌టీ అధికారుల నిర్లక్ష్యానికి ఇదో ఉదాహరణ.
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర రవాణాలో కీలకంగా మారిన మెట్రో రైలు నిర్వహణను ఎల్‌అండ్‌టీ అధికారులు గాలికి వదిలేశారు. సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా నడుస్తున్న రైళ్లు అకస్మాత్తుగా ఆగిపోతుండడంతోపాటు కోచ్‌ల్లో డిస్‌ప్లే బోర్డులు పనిచేయకపోవడం, రేకులు విరిగిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రైళ్లను నిత్యం తనిఖీల తర్వాతే పట్టాలపైకి పంపిస్తున్నామని చెబుతున్న అధికారులు వాటి లోపాలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
పావురాలతో పరేషాన్..
వాస్తవంగా హైదరాబాద్ మెట్రో రైళ్లు, స్టేషన్ల నిర్వహణను ఎల్‌అండ్‌టీ చూసుకోవాల్సి ఉండగా కేవలం రైళ్ల రాకపోకలను మాత్రమే పర్యవేక్షిస్తోంది. ఫ్లాట్‌ఫారాలు, ఎస్కలేటర్లపై పావురాల వ్యర్థాలను రోజుల తరబడి తొలగించకపోవడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఎంజీబీఎస్, ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, సికింద్రాబాద్, మెట్టుగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు పావురాలతో పరేషాన్ అవుతున్నారు.
బేరింగ్ శబ్దాలు
మూలమలుపుల వద్ద రైళ్లలో బేరింగ్ శబ్దాలు ఎక్కువగా వస్తుండడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. నాంపల్లి, లక్డీకపూల్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక, మలక్‌పేట్ స్టేషన్ల సమీపంలో బేరింగ్ శబ్దాలు వస్తుండడంతో కొంతమంది రైలు ఎక్కేందుకు వెనుకంజ వేస్తున్నారు.
స్టేషన్లలో టాయిలెట్లకూ డబ్బులు
మెట్రో స్టేషన్లలో టాయిలెట్లకు డబ్బులు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు ఉచితంగా సేవలందించగా ప్రస్తుతం సులభ్ కాంప్లెక్స్‌కు టెండర్ల ప్రాతిపదికన అప్పగించారు. మూత్ర విసర్జనకు రూ.2, టాయిలెట్ వాడకానికి రూ.5 తీసుకుంటుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌అండ్‌టీ వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రకటనలకు ప్రాధాన్యమిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఒక్కో సంస్థ నుంచి ఏడాదికి సుమారు రూ.కోటి వరకు తీసుకుంటూ స్టేషన్లకు అదనపు పేర్లను కలుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Updated Date - 2023-06-23T18:12:54+05:30 IST