Hyderabad: నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
ABN, First Publish Date - 2023-11-13T10:37:37+05:30
Hyderabad: నగరంలోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది..
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్‌ఘాట్‌లోని నాలుగు అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో డీజిల్ డ్రమ్ముల్లో చెలరేగిన మంటలతో ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు అంతస్థుల వరకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కొందరు సజీవదహనం అవగా... మరికొందరు ఊపిరాడక మృతి చెందారు. కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. మరికొంతమంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా.. నాలుగు అంతస్థుల బిల్డింగ్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్‌లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అదే సమయంలో అక్కడ ఉన్న డిజిల్, కెమికల్ డ్రమ్మలకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్ర పెరిగింది. అంతకంతకూ మంటలు చెలరేగి నాలుగు అంతస్తుల భవనం మొత్తం చుట్టుముట్టాయి. మంటల ధాటికి పై అంతస్థుల్లో వారు బయటకు రాలేని పరిస్థితి. దీంతో మంటల్లో చిక్కుకుని దాదాపు ఏడుగురు సజీవదహనం అయ్యారు. ప్రమాదంలో గ్యారేజ్‌లో ఉన్న వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరోవైపు నాలుగు అంతస్థులు మొత్తం మంటలు వ్యాపిస్తుండటంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 15 మందిని డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది రక్షించారు. జనావాసాల మధ్య ప్రమాదం జరగడంతో.. దట్టమైన పొగ అలముకోవడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టుపక్కల ఉండే భవనాలకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో వారందరినీ ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడి నుంచి దూరంగా తరలిస్తున్నారు. మరి కొంతమంది కార్మికులు చిక్కుకోవడంతో వారిని రెస్క్యూ చేసేందుకు సహాయకచర్యలు ముమ్మరం చేశారు. మంటలు అదుపులోకి రాడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-11-13T14:44:10+05:30 IST