PM Modi: ఆ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలి... గద్దర్ భార్యకు ప్రధాని మోదీ లేఖ
ABN, First Publish Date - 2023-08-25T11:42:11+05:30
ప్రజాకవి గద్దర్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ మృతి తెలుసుకుని చాలా బాధపడినట్లు తెలిపారు.
హైదరాబాద్: ప్రజాకవి గద్దర్ (Prajakavi Gaddar) మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ మృతి తెలుసుకుని చాలా బాధపడినట్లు తెలిపారు. ఈ మేరకు గద్దర్ భార్య గుమ్మడి విమలకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ‘‘తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి. గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయి. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ దుఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి!’’ అంటూ ప్రధాని మోదీ లేఖలో పేర్నొన్నారు.
కాగా.. ఈ నెల 6న ప్రముఖ విప్లవ కవి, ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం అధికారికంగా వెల్లడించారు. రెండు రోజులక్రితమే ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని వైద్యులు ప్రకటించారు. అంతలోనే ఈ విషాదవార్త వినాల్సి వచ్చింది. కాగా గద్దర్ అసలు పేరు విఠల్ రావు. అందరికీ గద్దర్‌గా సుపరిచితులైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.
Updated Date - 2023-08-25T11:42:11+05:30 IST