TSPSC: టీఎస్పీఎస్సీకి కీలక అధికారుల రాజీనామా
ABN, First Publish Date - 2023-12-12T19:53:18+05:30
టీఎస్పీఎస్సీ (TSPSC) బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ ( R Satyanarayana ) తన పదవీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం నిరుద్యోగుల కోసం ఓలేఖ రాశారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ ( R Satyanarayana ) తన పదవీకి రాజీనామా చేశారు. సత్యనారాయణతో పాటు మరో నలుగురు సభ్యులు రాజీనామా చేశారు. వారిలో బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్, రవీంద్రారెడ్డి ఉన్నారు. రాజీనామా అనంతరం నిరుద్యోగుల కోసం ఆర్ సత్యనారాయణ ఓ లేఖ రాశారు. లేఖలో సత్యనారాయణ ఏం పేర్కొనారంటే..‘‘నేను ఏ తప్పు చేయలేదు.. అయినా పదవీ నుంచి తప్పుకుంటున్నాను. కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలన్న ఉద్యోగార్తుల ఆకాంక్షలను గౌరవిస్తున్నాను. ఇప్పుడే కాదు.. నేను నా విద్యార్థి జీవిత కాలం నుంచి కూడా నిరుద్యోగుల పక్షమే. ఇకముందు కూడా నిరుద్యోగుల పక్షమే. మీ అందరి ఆశలు, ఆకాంక్షలు వీలైనంత త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను. టీఎస్పీఎస్సీలో పేపర్ల లీకేజీలు లాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎంత మానసిక ఆందోళనకు గురయ్యారో, ఎంత ఆవేదన చెందారో ఒక జర్నలిస్టుగా, ఒక మానవతావాదిగా నేను అర్థం చేసుకోగలనని అన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో నా బాధ్యతను నిర్వర్తించలేను
‘‘ఈ పేపర్ లీకేజీ సంఘటనలు జరిగినప్పుడు కమిషన్ బాధ్యులుగా మేము కూడా తీవ్ర మానసిక క్షోభను అనుభవించాం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. తీవ్ర అనారోగ్యాలకు గురయ్యాం. మాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగార్థుల ప్రయోజనాలను రక్షించేందుకే అహర్నిశలు కృషిచేశాం. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కమిషన్ సభ్యుడిగా నేను నా బాధ్యతను నిర్వర్తించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 315 నుంచి 323 వరకు ఈ సంస్థకు వర్తిస్తాయి. సంస్థ నిర్మాణం, కమిషన్ ఏర్పాటు రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్ ప్రకారం జరుగుతుంది. కమిషన్ నుంచి ఎవరినైనా తొలగించాలంటే దానికీ ఒక పద్ధతి ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణలో ఆరోపణలు రుజువైతే రాష్ట్రపతి కమిషన్‌ను తొలగించవచ్చు. కానీ కమిషన్‌లో ఏ సభ్యుడిపై కూడా వ్యక్తిగత ఆరోపణలు రాలేదు. విచారణ జరగలేదు. కానీ కమిషనర్‌ని రద్దు చేయాలని కొందరు, కమిషన్ సభ్యులను తొలగించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగం గురించి, ప్రభుత్వ నిబంధనల గురించి తెలిసినవారు కూడా ఈ రకమైన డిమాండ్ చేస్తున్నారు’’ అని ఆర్. సత్యనారాయణ తెలిపారు.
నిరుద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం
‘‘పౌర సమాజంలోని వివిధ సంస్థలు ఈ తరహా డిమాండ్‌ని ముందుకు తెస్తూ వస్తున్నాయి. టీఎస్పీఎస్సీపై ఏకపక్షమైన విమర్శల దాడి జరుగుతోంది. మరికొందరైతే కమిషన్ బాధ్యులను అసమర్థులని పరుషమైన పదాలతో నిందిస్తున్నారు. తద్వారా వ్యక్తిత్వాలను హత్య చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హేతుబద్ధమైన విశ్లేషణలు కరువయ్యాయి. విచారణ లేకుండానే గంపగుత్తగా టీఎస్పీఎస్సీ సభ్యులందరిని దోషులుగా నిర్ణయించేశారు. చస్తారో బతుకుతారో తేల్చుకోవాలని మెడపై కత్తులు వేలాడదీశారు. కమిషన్ సభ్యులుగా కొనసాగాలని ఈ పదవులు పట్టుకుని వేలాడాలని మాకు ఏమాత్రం లేదు. పదవులు మాకు ముఖ్యం కాదు. తెలంగాణ నిరుద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని ఏడాదిలోపే తృణప్రాయంగా వదులుకున్నాను. స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటలు చేశాం. మా సహచర సభ్యులు కూడా రాష్ట్ర సాధనకోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఈ తరహా చరిత్ర కలిగిన మాకు తెలంగాణ నిరుద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం తప్ప పదవులు కాదు’’ అని ఆర్. సత్యనారాయణ తెలిపారు.
కొందరు స్వార్థపరులు అలా చేస్తున్నారు
‘‘2021 మే నెల 19వ తేదీన మేము కమిషన్ సభ్యులుగా నియామకమైన నాటినుంచి ఇప్పటివరకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా మా బాధ్యతలను నిర్వర్తించాము. 17,269ఉద్యోగాలకు సంబంధించి 26 నోటిఫికేషన్లు జారీ చేశాం. 13,821 ఉద్యోగాలకు సంబంధించి 20 పరీక్షలు నిర్వహించాం. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఈలోగా కొందరు స్వార్థపరుల కారణంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. వారంతా ఎంతో మానసిక ఆందోళనకు గురయ్యారు. మేము కూడా తీవ్రమైన మానసిక ఆందోళన, ఉద్రిక్తత, ఆవేదన, క్షోభకు గురయ్యాం. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు కొందరు స్వార్థపరులు ప్రయత్నించారు. టీఎస్పీఎస్సీకి రాజకీయ మార్పులతో సంబంధం లేదు. ప్రభుత్వాలు మారినా కమిషన్ కొనసాగుతుంది. కమిషన్‌కి ఒకసారి నియామకం అయ్యాక నియమిత కాలం పదవిలో కొనసాగవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము మా బాధ్యతను నిర్వర్తించే వాతావరణం లేదు. ఈ నేపథ్యంలో నేను టీఎస్పీఎస్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నేను ఎల్లప్పుడూ మీ పక్షమే. ఎక్కడవున్నా ఉద్యోగార్థులకు మేలు జరగాలనే కోరుకుంటాను. మీ పక్షానే నిలిచి చేదోడు వాదోడు అవుతాను. మీకు మంచి జరగాలని ఆకాంక్షిస్తాను’’ అని ఆర్. సత్యనారాయణ లేఖలో తెలిపారు.
Updated Date - 2023-12-12T22:01:40+05:30 IST