Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ వ్యూహం మారిందా?
ABN, First Publish Date - 2023-10-25T02:50:25+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
తెలంగాణలో అంతా తానై!
అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాహుల్‌గాంధీ
ప్రచార బాధ్యతను భుజాన వేసుకున్న అగ్రనేత.. ఇప్పటికే 3 రోజుల ప్రచారం
1 నుంచి రాష్ట్రంలో మళ్లీ యాత్ర!.. ఈసారి వారం పాటు ఉండే చాన్స్
ప్రచారంలో ప్రియాంకా గాంధీ కూడా పాల్గొనే అవకాశం
ఈ నెల 31న కొల్లాపూర్ సభకు హాజరవనున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
27 లేదా 29న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాక
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ తరఫున ప్రచార బాధ్యతను కూడా పూర్తిగా ఆయన భుజాన వేసుకున్నారు. ఇప్పటికే మూడు రోజులపాటు బస్సుయాత్రలో పాల్గొన్న రాహుల్.. మరోసారి నవంబరు 1 నుంచి వారం పాటు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న రామప్ప ఆలయం వద్ద పార్టీ ముఖ్యనేతల బస్సుయాత్రను ప్రారంభించడంతోపాటు ఆ యాత్రకు తానే స్వయంగా నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉందని భావిస్తున్న వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కొనసాగిన రాహుల్ యాత్రకు.. ఆ పార్టీ నేతలు కూడా ఊహించని స్థాయిలో ప్రజల నుంచి స్పందన వచ్చింది. దీంతో ఈ నెల 28 నుంచి పునఃప్రారంభం కానున్న యాత్రలోనూ రాహుల్‌ను భాగస్వామిని చేయాలని అధిష్ఠానం భావించింది. అయితే మలి విడత అభ్యర్థుల జాబితాపై ఇంకా స్పష్టత రాకపోవడం, ఇతర కారణాల వల్ల ఆయన పర్యటనను నవంబరు 1కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆ రోజు నుంచి వారం పాటు రాహుల్‌గాంధీ బస్సు యాత్రలో పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాహుల్‌గాంధీతో కలిసి బస్సు యాత్రను ప్రారంభించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ సైతం మరోమారు ఆ యాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 31న కొల్లాపూర్‌లో ప్రజాభేరి పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఆ సభ తర్వాత ఆమె కూడా ఓ రెండు రోజులపాటు బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా ఈ నెల 27 లేదా 29న కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెంటీలను తన ప్రభుత్వం ఎలా అమలు చేస్తోందన్న విషయాన్ని ఆయన వివరిస్తారని పేర్కొంటున్నాయి.
తెలంగాణకు ఇంత ప్రాధాన్యం అందుకే..!
తెలంగాణలో 2018 ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్‌గాంధీ పాలుపంచుకున్నా.. అప్పుడు బహిరంగ సభలకే పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో మాత్రం బస్సు యాత్రల పేరుతో రోడ్‌షోల్లోనూ పాల్గొంటూ ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న అధిష్ఠానం.. ఇక్కడి నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనన్న ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఒంటి చేత్తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే నాయకత్వ కొరత కూడా ఉందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పార్టీకి సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని మరింత అనుకూలంగా మార్చుకునేందుకు ముఖ్యనేతల బస్సు యాత్రలో రాహుల్‌గాంధీని పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. అదే సమయంలో.. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకూ కొనసాగనున్న ఈ బస్సు యాత్రలో పార్టీ ముఖ్యనాయకులందరినీ భాగస్వాములను చేయడం ద్వారా ఏ ఒక్క నేతకో కాకుండా ఉమ్మడి నాయకత్వానికి క్రెడిట్ దక్కేలా చేస్తోందని అంటున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే.. అధిష్ఠానం సూచన మేరకు నాయకత్వం నడుచుకునేటట్లుగా జాగ్రత్త పడుతోందని విశ్లేషిస్తున్నారు.
నవంబరు మొదటి వారంలో రాహుల్ పర్యటన: మహేశ్‌కుమార్‌గౌడ్
రాష్ట్రంలో నవంబరు మొదటి వారంలో రాహుల్‌గాంధీ పర్యటన ఉంటుందని, రెండో విడత బస్సుయాత్రలో ఆయన పాల్గొంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. 31న కొల్లాపూర్‌లో జరిగే పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారన్నారు. ఆరు గ్యారంటీ స్కీమ్‌లపై 26, 27వ తేదీల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి.. ఇతర సీనియర్ నేతలు ప్రచారం చేస్తారని చెప్పారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో వారి పర్యటన ఉంటుందన్నారు.28 నుంచి రెండో విడత బస్సుయాత్ర ప్రారంభం కానుందన్నారు. నిజామాబాద్ అర్బన్ టికెట్‌ను ఎవరికి కేటాయించాలన్నది స్ర్కీనింగ్ కమిటీ చూసుకుంటుందని, కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయమే ఫైనల్ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆదిలాబాద్. నిజాబామాద్, మహబూబ్‌నగర్ స్థానాలను మైనారిటీలు అడుగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మైనారిటీలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, వారికి పార్టీ తగిన న్యాయం చేస్తుందని అన్నారు.
Updated Date - 2023-10-25T10:56:31+05:30 IST