High Court: వైఎస్సార్‌టీపీ T-SAVE నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ABN, First Publish Date - 2023-04-21T16:16:07+05:30
వైఎస్సార్ (YSR) తెలంగాణ పార్టీ అధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్షం తలపెట్టిన టీ-సేవ్ (T-SAVE) నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్: వైఎస్సార్ (YSR) తెలంగాణ పార్టీ అధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్షం తలపెట్టిన టీ-సేవ్ (T-SAVE) నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు హైకోర్టు తెలిపింది. దీక్ష చేసే 48 గంటల ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు వెల్లడించింది. 500 మంది కంటే జనసమీకరణ మించకూడదని హైకోర్టు సూచించింది.
అయితే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ సోమవారం ఇందిరా పార్క్ వద్ద వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తలపెట్టిన ఒకరోజు నిరసన దీక్షకు ట్రాఫిక్ కారణాలు చూపుతూ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై పార్టీ నేతలతో ఆదివారం సమీక్షించిన షర్మిల దీక్షపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన నిరుద్యోగంపై తన పోరాటం ఆగబోదని షర్మిల అన్నారు. యువత భవిత కోసం తన ప్రాణాలను ఇచ్చేందుకూ సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
కాగా.. తెలంగాణ (Telangana)లో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారు. దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉంటే తెలంగాణలో కేసీఆర్ (KCR) రాజ్యాంగం అమలు అవుతుందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు స్థానం లేదని, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనేది కేసీఆర్ ఉద్దేశమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీలో గూండాలు మాత్రమే ఉన్నారని విమర్శించారు.
వీధి కుక్కలు దాడి చేసి పసి ప్రాణాలు తీస్తే పట్టించుకునే దిక్కులేదని, తెలంగాణలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని, రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగాలను కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకున్నారని షర్మిల ఆరోపించారు. ప్రజల పక్షాన తాను నిలబడితే ఇష్టం వచ్చినట్లు తనను తిట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇబ్బందులు పెడుతున్నారని, తొమ్మిది సంవత్సరాల్లో కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం వైఎస్‌ఆర్‌టీపీకి (YSRTP), ప్రతిపక్షాలకు లేదని షర్మిల అన్నారు.
Updated Date - 2023-04-21T16:19:37+05:30 IST