ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay Kumar : బండికి బెయిల్

ABN, First Publish Date - 2023-04-07T02:25:18+05:30

తీవ్ర ఉత్కంఠ.. సుదీర్ఘ, హోరాహోరీ వాదనల తర్వాత పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు బెయిల్‌ మంజూరైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

షరతులతో మంజూరు.. 20 వేల పూచీకత్తు, ఇద్దరి జమానతు

రాత్రి పది గంటలకు న్యాయమూర్తి అనిత ఆదేశాలు

సాక్షులను ప్రభావితం చేయవద్దని స్పష్టీకరణ

కరీంనగర్‌ జైలు నుంచి నేడు విడుదలయ్యే చాన్స్‌

ఎనిమిది గంటలపాటు సుదీర్ఘ వాదనలు.. ఉత్కంఠ

పోలీసుల కస్టడీ పిటిషన్‌ సోమవారానికి వాయిదా

బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు

ఓరుగల్లు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి/వరంగల్‌ లీగల్‌, ఏప్రిల్‌ 6: తీవ్ర ఉత్కంఠ.. సుదీర్ఘ, హోరాహోరీ వాదనల తర్వాత పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు బెయిల్‌ మంజూరైంది. రూ.20 వేల పూచీకత్తుతోపాటు ఇద్దరి జమానతు సమర్పించాలని హనుమకొండ నాలుగో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఇన్‌చార్జి న్యాయమూర్తి రాపోలు అనిత తీర్పు వెలువరించారు. దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, కేసు విచారణకు సహకరించాలని న్యాయమూర్తి షరతులు విధించారు. అంతకు ముందు బెయిల్‌, కస్టడీ పిటిషన్లకు సంబంధించి గురువారందాదాపు ఎనిమిది గంటలపాటు హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి, రాత్రి పది గంటలకు బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో, సంజయ్‌ శుక్రవారమే కరీంనగర్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో సంజయ్‌ను ఏ1 నిందితుడిగా నమోదు చేయడం; కోర్టు 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే.. పోలీసులు కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. పిటిషనర్‌ బండి సంజయ్‌ తరపున న్యాయవాదులు విద్యాసాగర్‌ రెడ్డి, చొల్లేటి రామకృష్ణ, వై.శ్యాంసుందర్‌ రెడ్డి, సంసాని సునీల్‌ వాదించారు. ప్రాసిక్యూషన్‌ తరపున రేవతి వాదించారు. న్యాయవాదులతో కోర్టు కిక్కిరిసిపోయింది. ఇరు వర్గాల మధ్య దాదాపు ఎనిమిది గంటలపాటు వాదనలు జరిగాయి. చివరికి, కస్టడీ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి.. బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. దాంతో, సంజయ్‌కు బెయిల్‌ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొంది. బండి సంజయ్‌కు బెయిల్‌ ఇస్తే కేసులో ఇప్పటికే సేకరించిన ఆధారాలను, సాక్షులను ప్రభావితం చేసి తారుమారు చేసే అవకాశం ఉందని, బెయిల్‌ ఇవ్వకూడదని పోలీసుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రేవతి బెయిల్‌ పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేస్తే ఇలాంటి పేపర్‌ లీకేజీ ప్రచారంలాంటి సంఘటనలు జరుగుతాయని వాదించారు. తద్వారా, రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందన్నారు. పరీక్షలు ఇంకా జరుగుతున్నాయని, లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంజయ్‌కు బెయిల్‌ ఇవ్వకూడదని వాదించారు. పేపర్‌ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్‌కు బెయిల్‌ ఇస్తే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయి చర్యలు చేపట్టే అవకాశం ఉందని, ఫలితంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుందని చెప్పారు.

కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న మొబైల్‌ ఫోన్‌ను సంజయ్‌ నుంచి ఇంకా స్వాధీనం చేసుకోలేదన్నారు. బెయిల్‌ మంజూరు చేస్తే సంజయ్‌ మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయని తెలిపారు. అయితే, సంజయ్‌పై తప్పుడు కేసులు బనాయించారని ఆయన తరఫు న్యాయవాదులు అన్నారు. పేపర్‌ లీకేజీకి సంబంధించి బూరం ప్రశాంత్‌తో కలిసి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు కుట్ర పన్నుతున్నారని సంజయ్‌ మీద కేసులు నమోదు చేశారని, అందులోని సెక్షన్లన్నీ తప్పుడు కేసులేనని పేర్కొన్నారు. కమలాపూర్‌ పాఠశాలలో పని చేస్తున్న చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఏప్రిల్‌ 4న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం 11 గంటలకు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసుకున్నారని, ఎస్సెస్సీ 2019-20 వాట్సాప్‌ గ్రూపులో దానిని పోస్ట్‌ చేశారని, ఈ విషయం తన మిత్రుల ద్వారా తెలిసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని గుర్తు చేశారు. నిజానికి, ఉద్దేశపూర్వకంగా, అంతర్లీనమైన ఇతర కారణాలతోనే సంజయ్‌పై పిటిషన్‌ దాఖలు చేయించారని ఆరోపించారు. సంజయ్‌ ఇప్పటి వరకూ ఎవరినీ మోసం చేయలేదని, గౌరవప్రదమైన హోదాలో ఉన్నారని, పార్లమెంట్‌ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ క్లయింట్‌ న్యాయస్థానాలను గౌరవిస్తారన్నారు. రెగ్యులర్‌గా కోర్టుకు హాజరవుతారన్నారు. రిమాండ్‌లో ఉంచడం ద్వారా ఆయన కుటుంబం చాలా ఇబ్బంది పడుతోందన్నారు. అలాగే, ఈనెల 8న ప్రధాన మంత్రి మోదీ రాష్ట్రానికి వస్తున్నారని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉందని తెలిపారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని, అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, అధికారులు పోలీసులతో కుమ్మక్కై తప్పుడు కేసులు బనాయించారని వాదించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల విచారణను పూర్తి చేశారని, ఇక మిగిలింది కేవలం చార్జిషీట్‌ దాఖలు చేయడం మాత్రమేనని తెలిపారు. పోలీసులు ఆరోపిస్తున్నట్టు ఆధారాలు, సాక్ష్యాలను నాశనం చేసే అవకాశాలు లేనేలేవని, న్యాయస్థానం విధించే ఎలాంటి షరతులకైనా లోబడి తమ క్లయింట్‌ నడుచుకుంటారని తెలిపారు. అయితే, సంజయ్‌ విడుదలకు సంబంధించి ఆయన తరఫు న్యాయవాదులు ఫోన్లో జైలు అధికారులను సంప్రదించారు. శుక్రవారం ఉదయం బెయిల్‌ ఉత్తర్వు పత్రాలను అందిస్తే విడుదల చేస్తామని అధికారులు చెప్పినట్లు తెలిసింది.

కస్టడీ పిటిషన్‌ దాఖలు

అంతకుముందు బండి సంజయ్‌తోపాటు ఏ-2గా ఉన్న బూర ప్రశాంత్‌, ఏ-3 గుండబోయిన మహేశ్‌లను పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలంటూ కమలాపూర్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా నిందితులు వాడిన వాట్సాప్‌ చాట్స్‌, ఇతరత్రా సాంకేతిక అంశాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని, ఇవి కేసు పురోగతికి ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రేవతి వాదనలు వినిపించారు. పదో తరగతి పరీక్షలు ఇంకా జరుగుతుండడం వల్ల విద్యార్థుల్లో భయాందోళనలు లేకుండా చూడాల్సి ఉందని, నిందితుల నుంచి సెల్‌ ఫోన్‌ డేటా సేకరించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికీ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల వివరాలు వీరి ద్వారా సేకరించాల్సి ఉందని, వీరిచ్చిన సమాచారం ఆధారంగా ఇంకా కొంతమంది సాక్షులను విచారించాల్సి ఉందని వివరించారు. సంజయ్‌ మద్దతుదారులు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశాలున్నాయని వాదించారు. సంజయ్‌ను అరెస్ట్‌ చేసిన రోజున భారీ సంఖ్యలో మద్దతుదారులు హాజరయ్యారని, సంజయ్‌తోపాటు మరో ఇద్దరు నిందితులు ప్రశాంత్‌, మహేశ్‌లను పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. అయితే, ఏ-2, ఏ3లకు కూడా నోటీసులు ఇవ్వనందున కేసువిచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు.

బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు

సంజయ్‌కు బెయిల్‌ రావడంతో బీజేపీ శ్రేణులు రాత్రి నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని హర్షం వ్యక్తం చేశారు. పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు. కాగా, సంజయ్‌కు బెయిల్‌ రావడంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో గొంతు నొక్కాలని కేసీఆర్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కల్వకుంట్ల కుటుంబ అరాచకాలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. నిరుద్యోగులు, విద్యార్థులతోపాటు ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సంజయ్‌కు బెయిల్‌ లభించడం ప్రజాస్వామ్య విజయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి అన్నారు. అక్రమంగా అరెస్ట్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని భావించిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు కోర్టు ఉత్తర్వులు చెంప పెట్టు అని అన్నారు.

Updated Date - 2023-04-07T03:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising