TS News: టెన్త్ పేపర్ లీక్.. బయట పెట్టిన బండి సంజయ్ అనుమానం
ABN, First Publish Date - 2023-04-03T19:38:37+05:30
రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు పేపర్ లీక్ కావడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు పేపర్ లీక్ కావడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) అన్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో పరీక్షల లీక్ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పరీక్షలు వస్తే లీక్‌ల జాతర నడుస్తోందని విమర్శించారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ చేతగానితనం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందన్నారు. ఈ పేపర్ లీక్‌తో ప్రభుత్వ, చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
టెక్నాలజీని పేపర్ లీక్ కోసం ఉపయోగించుకుంటున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పేపర్ లీక్‌కి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. టెన్త్ పరీక్షలు 90 శాతం సిలబస్‌తో ఒకే పేపర్ గా పరీక్ష నిర్వహించడంవల్ల విద్యార్థుల్లో ఇప్పటికే ఒత్తిడి కన్పిస్తొందన్నారు. ఈ లికేజ్ ఘటనతో విద్యార్థుల్లో మరింత గంధరగోళం నెలకొందని బండి సంజయ్ అన్నారు. మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులంతా టెన్షన్‌కు గురికాకుండా దైర్యంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలన్నారు. 10వ తరగతి తెలుగు పేపర్ లీక్‌పై న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ లీక్ వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దన్నారు. బాద్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2023-04-03T19:38:41+05:30 IST