Supreme Court BRS: సుప్రీంలో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ
ABN, First Publish Date - 2023-10-20T11:49:40+05:30
చపాతి రోలర్, రోడ్డు రోలర్ తేడా తెలియదు అనుకుంటున్నారా?, ఎన్నికలు వాయిదా వేయాలని మీరు కోరుకుంటున్నారా? హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు రావడం ఏంటి?
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్ పిటిషన్ ధర్మాసనం కొట్టేసింది. ఓటర్లకు అన్నీ తెలుసని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలినట్టయ్యింది. సుప్రీం నిర్ణయంతో బీఆర్ఎస్ అధిష్టానం, ఆ పార్టీ అభ్యర్థులు ఆలోచనలో పడినట్లు తెలిసింది.
సుప్రీం సీరియస్..
‘భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్షరాసులు కాదు. ఓటర్లకు కారు, చపాతి రోలర్, రోడ్డు రోలర్ తేడా తెలియదు అనుకుంటున్నారా?.. ఎన్నికలు వాయిదా వేయాలని మీరు కోరుకుంటున్నారా? హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు రావడం ఏంటి?. అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా?’ అంటూ బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
అసలేం జరిగింది..?
కాగా.. కారును పోలిన గుర్తులను తొలగించాలంటూ న్యాయస్థానంలో బీఆర్ఎస్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. చపాతీ రోలర్, రోడ్డు రోలర్, తదితర గుర్తులను ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకుండా ఎన్నికల సంఘానికి ఆదేశించాలంటూ బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులతో నష్టపోయామని పిటిషన్‌లో పేర్కొంది. విచారణ చేపట్టిన ధర్మాసనం బీఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టేసింది. ఓటర్లకు అన్ని విషయాలు తెలుసని కోర్టు వ్యాఖ్యానించింది.
Updated Date - 2023-10-20T11:49:43+05:30 IST