Hyderabad : ఆకాష్ అంబానీ మాలూమ్ తేరేకో.. అంటూ జూబ్లీహిల్స్ పీఎస్‌లో వింత దొంగ రుబాబు..
ABN, First Publish Date - 2023-10-14T09:34:01+05:30
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఖుషీ’ మూవీలో ఓ ఆకతాయి చెప్పే డైలాగ్ ఉంటుంది. ‘జయ ఆంటీ మాలూమ్ తేరేకో.. లల్లూ అంకుల్ మాలూమ్ తేరేకో.. ఓ సబ్ మేరే పీఛే హై’ అంటూ తాజాగా ఓ వింత దొంగ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఇలాగే చేశాడు.
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఖుషీ’ మూవీలో ఓ ఆకతాయి చెప్పే డైలాగ్ ఉంటుంది. ‘జయ ఆంటీ మాలూమ్ తేరేకో.. లల్లూ అంకుల్ మాలూమ్ తేరేకో.. ఓ సబ్ మేరే పీఛే హై’ అంటూ తాజాగా ఓ వింత దొంగ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఇలాగే చేశాడు. ఖరీదైన కార్లను దొంగలించడమే పనిగా పెట్టుకున్నాడో దొంగ. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఆ దొంగను అయితే పట్టుకున్నాడు.
దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి.. హోటల్ దసఫల్లాకు వెళ్లాడు. కాసేపటికి హోటల్ నుంచి బయటకు వచ్చి చూస్తే తన రూ.1.7 కోట్ల కారు కనిపించలేదు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు అర్చిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటలోనే దొంగను గుర్తించి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆ వింత దొంగ విన్యాసాలు చూడ ముచ్చటిగా ఉన్నాయి.‘ఆకాష్ అంబానీ తెలుసా..’ అంటూ దబాయింపునకు దిగాడు. ‘హృతిక్ రోషన్ నా పీఏ..’ అంటూ రుబాబు చూపించాడు.
ఖరీదైన కార్లు చోరీ చేసి షికార్లు చేయడమే కాదు. ఖరీదైన వ్యక్తులు తన వెనుక ఉన్నాడంటూ హల్‌చల్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. నిజానికి మంత్రి కేటీఆర్ తన కారు తీసుకెళ్లాలని సూచించారని.. తను, తన సహాయకుడు హృతిక్ రోషన్ కలిసి ఆకాష్ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. అతని మాటలతో కంగుతిన్న పోలీసులు తలలు పట్టుకున్నారు. నిందితుడు మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు. అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స పొందినట్లు తెలిపారు.
Updated Date - 2023-10-14T10:52:48+05:30 IST