Ugadi Panchangam: వ్యతిరేకతలు వస్తాయి... పాలించే రాజు జాగ్రత్త..: బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్‌కుమార్
ABN, First Publish Date - 2023-03-22T12:18:11+05:30
నగరంలోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్: నగరంలోని రవీంద్రభారతి (Ravindrabharati)లో రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ శోభకృత నామ సంవత్సర పంచాంగాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం శారదాపీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగం శ్రవణం పఠించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. పెండింగ్ బిల్లులన్నింటికి క్లియరెన్స్ ఈ ఏడాది రాబోతోందన్నారు. కొంతమంది వ్యక్తుల నుంచి వ్యతిరేకతలు వస్తాయని... పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, కాళేశ్వరం ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది నిండబోతున్నాయన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమూల మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యా శాఖలో కొన్ని అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థ ఈ ఏడాది మంచి తీర్పులు ఇవ్వబోతోందని... సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వబోతున్నాయని సంతోష్‌కుమార్ వెల్లడించారు.
ఈ ఏడాది ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవాలని సూచించారు. కొన్ని మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర భారతంలో అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతున్నాయని వెల్లడించారు. ఈ మూడు మాసాల్లో విపరీతమైన ఒడిదుడుకులు జరగబోతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు ఆసక్తికరమైన రాజకీయాలను చూడబోతున్నారని తెలిపారు. మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని.. పోలీసులు బాగా పనిచేసే అవకాశం ఉందన్నారు. ధరలు తగ్గబోతున్నాయని... ఏప్రిల్‌లో విపరీతమైన ఎండలు ఉంటాయంటూ బ్రహ్మర్షి సంతోష్ కుమార్ పంచాంగం చదివి వినిపించారు.
Updated Date - 2023-03-22T12:26:44+05:30 IST