ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cost of land : వేలం మాఫియా

ABN, First Publish Date - 2023-08-14T02:37:48+05:30

రాజధాని హైదరాబాద్‌కు చెందిన సగటు జీవి నారాయణమూర్తి(GV Narayanamurthy).. మే 25న మేడిపల్లిలో ప్రభుత్వం నిర్వహించిన హెచ్‌ఎండీఏ లేఔట్‌(HMDA Layout) వేలం పాటలో పాల్గొన్నారు.

భూముల ధర మిథ్య

గజం రూ.40 వేలున్న చోట.. 70 వేల నుంచి రూ.లక్ష దాకా పాడేద్దాం

పోతే రూ.లక్ష.. వస్తే కోట్లల్లో.. వేలంలో రేట్లు పెంచేసే ‘రియల్‌’ కుట్ర

మేడిపల్లి వేలంలో అధిక ధరకు స్థలం కొనుక్కున్న వ్యక్తికి షాక్‌

అతడితోపాటు వేలంలో పాల్గొని ప్లాట్లు కొన్నవారు డబ్బుకట్టని వైనం

ఆ ప్రాంతంలో స్థలాల రేట్లు పెంచడానికి రియల్టర్ల మాయాజాలం

మోకిల వేలంలోనూ చుట్టుపక్కల ఆస్తులున్నవారే రేట్లు పెంచేశారు

అక్కడ వందల ఎకరాలున్న సంస్థే వేలంలో పాల్గొని ధరలను పెంచింది!

గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం

గడిచిన నాలుగేళ్లలో ఆ రాబడిఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి

‘రియల్‌’ ధరలు పెంచే కుట్రకు ప్రభుత్వ సహకారమూ ఉందన్న విమర్శలు

కొత్తగా పరిశ్రమలు వస్తేనో.. హైవే పడుతుందనే వార్తలు వస్తేనో తప్ప.. ఏ ప్రాంతంలోనైనా భూమి విలువ హఠాత్తుగా పెరగదు. కానీ.. అవేవీ లేకుండానే రాత్రికి రాత్రే భూముల ధరలను రెండు రెట్లు, అంతకుమించి పెంచే మాయాజాలం ప్రస్తుతం రాజధాని నగరం చుట్టూ జరుగుతోంది. అదే సర్కారీ వేలం. దానికి వేలం మాఫియా తాళం. రూ.లక్ష డిపాజిట్‌ కట్టి వేలంలో పాల్గొనడం.. అడ్డగోలుగా ధర పెంచి, ఆనక ఆ భూములను కొనకుండా వదిలేయడం. తాము కట్టిన ధరావతు సొమ్ము రూ.లక్ష పోయినా.. వేలంలో పెరిగిన రేట్ల దెబ్బకు చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువ కోట్లల్లో పెరుగుతుందన్నది వారి వ్యూహం. రాజకీయ నాయకులు, రియల్టర్లు కలిసి ఆడుతున్న ఈ నాటకానికి సర్కారు సహకారమూ ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి!!

హైదరాబాద్‌/సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌కు చెందిన సగటు జీవి నారాయణమూర్తి(GV Narayanamurthy).. మే 25న మేడిపల్లిలో ప్రభుత్వం నిర్వహించిన హెచ్‌ఎండీఏ లేఔట్‌(HMDA Layout) వేలం పాటలో పాల్గొన్నారు. గజం రూ.50 వేలు చొప్పున పాడి.. ఓ ప్లాటును దక్కించుకున్నారు. ఆ ప్లాట్‌ పూర్తి ధర చెల్లించారు. ఆ తర్వాత.. నారాయణమూర్తి హెచ్‌ఎండీఏ కార్యాలయానికి వెళ్లి తన ప్లాట్‌ పక్కన ప్లాట్లు కొనుగోలు చేసినవారి వివరాలు అడిగారు. భవిష్యత్తులో తన ఇరుగు, పొరుగు ఎవరో తెలుసుకోవాలనేది ఆయన ఉద్దేశం. కానీ.. ఆ వివరాలు తెలుసుకుని ఆయన తీవ్రషాక్‌కు గురయ్యారు! తనతోపాటు ఆయా ప్లాట్లను వేలంలో తనలాగే అధిక ధరకు కొనుగోలు చేసిన వారిలో దాదాపు 80ు మంది అసలు డబ్బే చెల్లించలేదు. ఆ వేలంపాటలో పాల్గొనడానికి కట్టిన ధరావతు సొమ్ము రూ.లక్షను కూడా వారు వదిలేసుకున్నారన్న విషయం తెలియడంతో.. ఆయన నివ్వెరపోయారు! వేలంలో ప్లాటును పాడుకున్న వారు.. నిర్ణీత గడువులోగా సొమ్ము పూర్తిగా చెల్లించకుంటే హెచ్‌ఎండీఏ డిపాజిట్‌ సొమ్ము లక్ష రూపాయలను తిరిగివ్వదు. నారాయణమూర్తి లాంటి సామాన్యులైతే అలా లక్ష రూపాయల డిపాజిట్‌ సొమ్మును వృథాగా వదిలేసుకోవడానికి సిద్ధపడరు. అలా వదులుకున్నవారంతా.. తమ ఆస్తుల విలువను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ముఠాలోనివారే. ఆ ప్రాంతంలో, చుట్టుపక్కల ఆస్తులున్న నాయకులు, వ్యాపారస్థుల ముఠా అది. ప్రీలాంచ్‌ ఆఫర్లలో తమ విల్లాలు, అపార్ట్‌మెంట్లను అమ్ముకోవాలనుకునే అత్యాశాపరులైన రియల్టర్ల మాయ అది. ఒక్క మాటలో చెప్పాలంటే.. వేలం మాఫియా అది. ధరావతు సొమ్ము కింద లక్ష రూపాయలు ఎరగా వేసి.. వేలంలో ప్లాట్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసి, ఆనక చల్లగా జారుకునే దారుణం వారు చేస్తున్నది. ‘‘పోతే రూ.లక్ష.. వస్తే మన భూముల విలువ అమాంతం పెరిగి రూ.కోట్లు వస్తాయి’’ అన్నది వారి ఆలోచన. ఇటీవలే హెచ్‌ఎండీఏ వేలం వేసిన మోకిల ప్లాట్ల విషయంలోనూ ఇదే జరిగినట్టు విశ్వసనీయ సమాచారం.

111 జీవో ఎత్తివేతతో..

ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను ఎత్తేవేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ జీవో పరిధిలో దాదాపు లక్ష ఎకరాల భూమి వినియోగంలోకి వచ్చింది. అప్పటి నుంచి రియల్‌ఎస్టేట్‌ రంగంపై కొనుగోలు అమ్మకాల ప్రభావం నెలకొంది. భూముల అమ్మకాలు, ఇంటి స్థలాల కొనుగోళ్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాలు, వ్యాపార అవసరాల కోసం కొనుగోలు చేసే కాంప్లెక్స్‌ల లావాదేవీల్లో స్తబ్దత నెలకొంది. 111 జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాల పరిసర ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్‌ రంగానికి అనుకూలంగా ఇప్పటికే 400 లేఔట్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల హెచ్‌ఎండీఏ అనుమతి కూడా తీసుకున్నారు. అయినా అక్కడ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం స్తబ్దుగానే ఉంది. సాధారణంగా రియల్‌ ఎస్టేట్‌ బాగుంటే స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా ఏటా పెరుగుతూ పోతుంది. గత నాలుగైదేళ్ల నుంచీ ఈ ఆదాయం 50ు నుంచి 100ు దాకా పెరిగింది. ఈ ఏడాది ఒక్క శాతం కూడా పెరగలేదు సరికదా.. గతేడాది కంటే పడిపోయింది. 2022లో ఏప్రిల్‌ నుంచి జూలై వరకూ రిజిస్ట్రేషన్‌ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఆదాయం, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో పోలిస్తే.. 2023లో అటు ఆదాయం, ఇటు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు.. రెండూ తగ్గాయి. 2022-23 ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై మాసాల్లో 6.99 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ కాగా.. ఈ ఏడాది ఈ నాలుగు నెలల్లో 6.56 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదే 4 నెలల కాలంలో ఆదాయం కూడా రూ.150 కోట్లు పైగా తగ్గింది. మరోవైపు రాష్ట్ర సర్కారు ఆదాయం రాబట్టుకునేందుకు నిర్వహిస్తున్న భూములకు వేలం పాటలో కనీవినీ ఎరుగని రీతిలో ధరలు పలకడం ఏమిటనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

సర్కారుకూ భాగం?

కుప్పకూలుతున్న రియల్‌ఎస్టేట్‌(Real Estate) ను కాపాడేందుకు రంగంలోకి దిగిన వేలం మాఫియాకు ప్రభుత్వ సహకారమూ ఉందన్న ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ మిలాఖత్‌లో భాగంగానే.. వేలంలో ప్రారంభ ధరలను సర్కారు ఆయా ప్రాంతాల్లో ఉన్న ధరలకు అనుగుణంగా, లేకుంటే ఇంకొంచెం ఎక్కువగానే నిర్ణయిస్తోందని, తర్వాత ఆ రేట్లను అడ్డగొలుగా పెంచే పనిని వేలం మాఫియా పూర్తిచేస్తోందని ఈ ఆరోపణలు చేస్తున్నవారు అంటున్నారు. ఉదాహరణకు మే 25న మేడిపల్లి (Medipalli)లో హెచ్‌ఎండీఏ 85 ప్లాట్లకు వేలం వేసి విక్రయుంచింది. ప్రారంభ ధరే రూ.32 వేలుగా నిర్ణయించింది. వేలంలో అత్యధికంగా గజం ధర రూ.50 వేలు పలికింది. కానీ.. వేలంలో ప్లాట్లను దక్కించుకున్నవారిలో కొందరు ఇప్పటికీ డబ్బు పూర్తిగా చెల్లించలేదు. ప్లాట్లను సొంతం చేసుకోలేదు. ఈ గూడుపుఠాణీని గుర్తించలేని కొందరు మధ్యతరగతి ప్రజలు మాత్రం గజం రూ.30-40 వేలున్న చోట రూ.50 వేలకు పైగా డబ్బు పోసి కొనుక్కొని తీవ్రంగా నష్టపోయారు. ఐదు రోజుల క్రితం మోకిలలో జరిగిన వేలం పాటలోను ఇలా తెరవెనక మతలబులు చాలా జరిగాయని విశ్వసనీయ సమాచారం. అక్కడ 167ఎకరాల్లో ప్రభుత్వం వెంచర్‌ను అభివృద్ధి చేసి ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి విడతలో 50 ప్లాట్లను వేలానికి పెట్టారు. ప్రారంభ ధర రూ.25 వేలుగా నిర్ణయించారు. వేలంలో ఆ ధర రూ.35-40 వేల దాకా వెళ్తుందని చాలామంది అనుకున్నారు.


అప్పటికి అక్కడ ఉన్న ధర అంతే కావడం, ఆ వెంచర్‌ను అభివృద్ధి చేసివ్వడానికి 18 నెలల సమయం పడుతుందని హెచ్‌ఎండీఏ చెప్పిన నేపథ్యంలో.. అంతకుమించిన ధర పలకదని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నవారే అంచనా వేశారు. అయితే వేలంలో మాత్రం గజం ధర రూ.65 వేల నుంచి లక్ష రూపాయల దాకా పలికింది. ఆ వేలంలో పాల్గొని ప్లాట్లు దక్కించుకున్నవారిలో 15 మంది అక్కడున్న ఒకే సంస్థకు చెందినవారని విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే.. వేలానికి పెట్టిన స్థలాలకు సమీపంలోనే ఆ సంస్థకు దాదాపు 350 ఎకరాల భూమి ఉంది. దీంతో ఆ సంస్థకు చెందినవారు వేలంలో పాల్గొని గజం లక్ష రూపాయల దాకా తీసుకెళ్లిపోయారని సమాచారం. అంతేకాదు.. దానికి సమీపంలోనే కొందరు రియల్టర్లు ఇటీవలే ప్రీలాంచ్‌ ఆఫర్లు ప్రారంభించారు. కొందరు రాజకీయ నేతలకూ అక్కడ భూములున్నాయి. వారంతా కలిసి అక్కడ భూమి ధరను విపరీతంగా పెంచేసి.. తమ ఆస్తుల విలువ పెంచి చూపించుకోవడం, ప్రీలాంచ్‌లు వేగంగా బుక్‌ చేసుకోవడం, అమ్మకాలు పెంచుకోవడం వంటివి చేస్తున్నారు. ఇవేవీ తెలియని సామాన్యులు.. పెరిగిన ధరలను చూసి నివ్వెరబోతున్నారు. ఈ పెరుగుదల నిజమైందే అనుకుని ఆ ధరలకు కొనుగోలు చేసి చేతులు కాల్చుకుంటున్నారు. మరికొందరు అంతంత డబ్బు పోసి కొనే సాహసం చేయలేక.. గజం జాగా కూడా కొనలేని నిరుపేదలుగా మిగిలిపోతున్నారు.

కోట్లకు కోట్లు..

హైదరాబాద్‌లోని కోకాపేట, బుద్వేల్‌, మోకిల ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో ఎకరం ధరలు కోట్లలో పలికాయి. కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లకుపైగానే పలకగా.. బుద్వేల్‌, మోకిలలో నిర్వహించిన వేలం పాటలోనూ ధరలు భారీగానే పలికాయి. మోకిలలో అన్ని సౌకర్యాలు, హెచ్‌ఎండీఏ అనుమతితో ఏర్పాటు చేసిన లే ఔట్లలో గజం విలువ సుమారు రూ.40 వేలు మాత్రమే ఉంది. కొంచెం తక్కువ సౌకర్యాలతో అభివృద్ధి చేసినవాటిలో గజం రూ.30 వేలకు కూడా దొరుకుతున్న పరిస్థితి ఉండేది. అలాంటిది హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన 165 ఎకరాల వెంచర్‌లో విక్రయించిన ప్లాట్ల వేలంలో గజం ధర రూ.65 వేల నుంచి లక్షకుపైగానే పలికింది. అంటే.. వేలం మాఫియా సర్కారు నిర్వహించిన వేలంపాటను వినియోగించుకుని అక్కడి భూముల విలువను అమాంతం పెంచేసిందన్నమాట. బుద్వేల్‌లో కూడా ఇలాగే ఎకరాకు రూ.10-15 కోట్లుగా ఉన్న ధరను వేలం పాటలో ఆకాశానికి ఎత్తేశారు.

Updated Date - 2023-08-14T04:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising