YS Sharmila : పోలీసులపై చేయి చేసుకోవడంపై స్పందించిన వైఎస్ షర్మిల..
ABN, First Publish Date - 2023-04-24T14:04:41+05:30
సిట్ కార్యాలయానికి తాను ఒక్కదాన్నే వెళ్ళాలని అనుకున్నానని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వెల్లడించారు. సిట్ అధికారిని కలిసి టీఎస్‌పీఎస్సీ దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నానని తెలిపారు.
హైదరాబాద్ : సిట్ (SIT) కార్యాలయానికి తాను ఒక్కదాన్నే వెళ్ళాలని అనుకున్నానని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వెల్లడించారు. సిట్ అధికారిని కలిసి టీఎస్‌పీఎస్సీ (TSPSC ) దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నానని తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు తమ అనుమానాలను అధికారికి చెప్పడం భాధ్యతగా ఫీలయ్యానని అన్నారు. సిట్ ఆఫీస్ కి వెళ్ళడానికిఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని షర్మిల తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ధర్నాకు పోలేదు. ముట్టడి అని పిలుపు నివ్వలేదు. నన్ను బయటకు పోనివ్వకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు..? నేను ఏమైనా క్రిమినల్ నా..? హంతకురాలినా? నాకు వ్యక్తిగత స్వేచ్చ లేదా..? నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకు..? పోలీసులు నాపై దురుసు ప్రవర్తనకి దిగారు. నా దారిన నేను వెళ్తుంటే అడ్డుపడ్డారు. నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నా మీద పడితే నేను భరించాలా..? నా రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు..?’’ అని ప్రశ్నించారు.
అసలేం జరిగిందంటే..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) విషయంలో సిట్ (SIT) అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందకు బయలు దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. లోటస్ పాండ్ వద్ద షర్మిల కారు ఎక్కే సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో షర్మిలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సోమవారం సిట్ అధికారులకు మెమొరాండం ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల భావించారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం 10:30 గంటలకు లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు ఒక్కసారిగా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకు వెళ్లేందుకు అనుమతిలేదని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే షర్మిల పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు వినిపించుకోలేదు.
ఒక పార్టీ అధ్యక్షురాలిపట్ల పోలీసుల తీరు సరిగా లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుళ్లను పెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆమెను తోసివేసే ప్రయత్నం చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తన తప్పులేకపోయినా పోలీసులు తనపై ప్రవర్తించిన తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విధుల్లో ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నందుకు షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై వైఎస్సార్‌టీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
Updated Date - 2023-04-24T14:22:22+05:30 IST