YS Sharmila.. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్‌కు ఏం చేతనైంది?: షర్మిల
ABN, First Publish Date - 2023-04-25T17:21:25+05:30
హైదరాబాద్: తొమ్మిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ (CM KCR)కు ఏం చేతనైంది?. అసలు పరిపాలన చేతనైందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు.
హైదరాబాద్: తొమ్మిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ (CM KCR)కు ఏం చేతనైంది?. అసలు పరిపాలన చేతనైందా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. మంగళవారం చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన ఆమె ఇంటికి చేరుకోగానే మీడియా సమావేశంలో మాట్లాడుతూ బంగారు తెలంగాణ తెస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. సెక్రటేరియట్‌కు ఎప్పుడైనా వెళ్లారా? అని నిలదీశారు. రుణమాఫీ, సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు, ఇంటికోక ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవేమీ అమలు చేయలేదని, ఇచ్చిన వాగ్ధానం ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.
అవినీతి చేయడం మాత్రమే కేసీఆర్‌కు చేతనైందని, వేలకోట్లు దోచుకున్నారని, రియల్ ఎస్టేట్ చేయడం కేటీఆర్ (KTR)కు చేతనైందని, లిక్కర్ స్కామ్‌కు పాల్పడటం కూతురు కవిత (Kavitha)కు చేతనైందని షర్మిల విమర్శించారు. కేసీఆర్ పాలన తాలిబన్లను తలపించేలా ఉందని, ప్రతిపక్షాలు గొంతు విప్పితే వారిపై కేసులు పెట్టి.. జైల్లో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. తాను సిట్ ఆఫీస్‌లో రిప్రజంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా?.. మహిళను అరెస్ట్ చేసే విధానం దారుణమన్నారు. పోలీసులను కుక్కల్లా వాడుకుంటున్నారని, సమస్యలపై పోరాడితే దాడులు చేస్తారా?.. అరెస్ట్ చేస్తారా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు లేదా? అని ప్రశ్నించారు.
పోలీసులు దాడులు చేస్తారనే తోసేశానని షర్మిల అన్నారు. తాను పోలీసులపై దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఎడిటింగ్ వీడియోలతో తనపై తప్పుడు కేసులు పెట్టారని, తల్లి విజయలక్ష్మి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. మాజీ సీఎం సతీమణి అన్న కనీస గౌరవం కూడా ఇవ్వలేదన్నారు. తనను ఎంత తొక్కాలని చూస్తారో.. అంత పైకి లేస్తానని షర్మిల స్పష్టం చేశారు.
Updated Date - 2023-04-25T17:21:25+05:30 IST