YS Sharmila: చిన్నదొర డైరెక్షన్‌లో టీఎస్‌పీఎస్సీ సిట్ దర్యాప్తు కథ కంచికి చేరినట్లే..!
ABN, First Publish Date - 2023-05-15T16:26:03+05:30
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ దర్యాప్తుపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ (TSPSC Paper Leakage) దర్యాప్తుపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) తనదైన శైలిలో స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...‘‘ప్రగతి భవన్ ప్రొడక్షన్, చిన్న దొర డైరెక్షన్‌లో సాగిన టీఎస్‌పీఎస్సీ సిట్ దర్యాప్తు కథ కంచికి చేరినట్లే..!’’ అంటూ యెద్దేవా చేశారు. లీకుల సూత్రధారులు బయట నిర్దోషులుగా తిరుగుతుంటే.. పాత్రధారులు బెయిల్‌పై బయటపడుతున్నారని మండిపడ్డారు. 30 లక్షల మంది జీవితాలతో చలగాటమాడిన అతిపెద్ద కుంభకోణం చివరికి బోర్డును కూడా కదిలించలేకపాయే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఐటీ శాఖ వైఫల్యం, కేటీఆర్ (Minister KTR) నిర్లక్ష్యం వల్లే ఈ స్కాం జరిగిందని ఆరోపించారు. సీబీఐ (CBI) రంగంలోకి దిగితే దొరుకుతామని భయపడ్డ దొరలు.. సిట్‌తో సైలెంట్‌గా సెట్ చేశారని విమర్శించారు. దొంగలకే తాళాలు ఇచ్చినట్టు, మళ్ళీ పాత టీఎస్‌పీఎస్సీతోనే పరీక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. అదే బోర్డు, అదే లీకులు, అవే కంప్యూటర్లు.. మారింది పరీక్ష తేదీలు మాత్రమే అని అన్నారు. కొత్త తేదీలతో పరీక్షలు పెట్టినంత మాత్రానా ఇంటి దొంగలు మళ్లీ పేపర్లు అమ్ముకోలేదని గ్యారెంటీ ఏంటి అని ప్రశ్నించారు. అపనమ్మకాన్ని మూటకట్టుకున్న టీఎస్‌పీఎస్సీ నుంచి ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఏంటి అని నిలదీశారు. టీఎస్‌పీఎస్సీ స్కాం తర్వాత తీసుకున్న చర్యలేంటి అని అడిగారు. ఇప్పటికైనా కేసీఆర్ (Telangana CM KCR) నోరు విప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Updated Date - 2023-05-15T16:26:03+05:30 IST