TSPSC Leakage: వైఎస్ షర్మిల టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం.. అరెస్ట్
ABN, First Publish Date - 2023-03-31T12:16:16+05:30
వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల టీఎస్‌పీఎస్సీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) టీఎస్‌పీఎస్సీ (TSPSC) ముట్టడి ఉద్రిక్తంగా మారింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌ను నిరసిస్తూ శుక్రవారం ఉదయం టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి షర్మిల యత్నించారు. కార్యాలయం ముందు షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని షర్మిలను అరెస్ట్ చేశారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును సీబీఐకు అప్పగిస్తూ.. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేపట్టిన టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి కార్యకర్తలతో చేరుకున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి ఆందోళన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను షర్మిల కోరారు. అయితే అందుకు పోలీసులు నిరాకరించారు.
టీఎస్‌పీఎస్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని, ఈ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) కేవలం ఇద్దరికి మాత్రమే ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. 2017 నుంచి పేపర్ లీకేజ్ జరుగుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు సేకరించడంలో విఫలమవుతోందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపైనా కేసులు పెడుతున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ (YSRTP Chief) మండిపడ్డారు. గతంలో అనేకమార్లు టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని (TSPSC Office) ముట్టడించేందుకు ప్రయత్నించగా షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ (House Arrest) చేసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించారు.
టీఎస్‌పీఎస్పీ లీకేజీ వ్యవహారాన్ని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఎస్పీ (BSP), వైఎస్సార్టీపీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఒక్కో పార్టీ ఒక్కోరంగా నిరసనలు తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా టీఎస్‌పీఎస్పీ కార్యాలయ ముట్టడికి వైఎస్సార్టీపీ పిలుపునిచ్చింది. ఇటీవల టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు మెమొరాండం ఇవ్వాలని షర్మిల భావించినప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించారు. రెండు స్లార్లు షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తాజాగా మూడోసారి పోలీసులకు తెలియజకుండా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. షర్మిల ఆందోళనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి.
Updated Date - 2023-03-31T12:28:51+05:30 IST