Kishan Reddy: సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా
ABN, First Publish Date - 2023-10-25T18:47:28+05:30
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది
"అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్ట్ భద్రత.. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ నాణ్యతపై అనుమానం బయటపడుతోంది. కేసీఆర్ ఒక సూపర్ ఇంజినీర్‌గా అవతారం ఎత్తి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ గుదిబండగా మారింది. లక్ష్మి బ్యారేజ్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైఫ్ లైన్. ఇది దెబ్బతింటే మొత్తం వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది. తెలంగాణ ప్రజల సంపద దోచుకోవడం కోసం కట్టిన ప్రాజెక్ట్. ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎమ్ లా మారింది తప్ప, 'ఎనీ టైం వాటర్' గా మాత్రం మారలేదు. వేల కోట్ల రూపాయల మేర అప్పు చేసి నిర్మించడమే ఒక దుర్మార్గం. పిల్లర్లు కుంగిపోవడం చాలా పెద్ద సమస్య. కుంగిపోయిన తర్వాత 85 గేట్స్ ఎత్తి 10 టీఎంసీల నీటిని కిందకు వదిలేయాల్సి వచ్చింది. గత ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోయింది. ఏడాదికి 400 టీఎంసీల నీటిని ఎత్తి పోస్తాం అన్నారు. ఇప్పటి వరకు మొత్తం కలిపి 154 టీఎంసీల నీటిని మాత్రమే నాలుగేళ్లలో ఎత్తి పోశారు. ఇందులో కేవలం 104 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించారు. పైగా ఆ నీటిని తీసుకొచ్చి చెరువులు, రిజర్వాయర్లు నింపి టూరిజం కోసం ఉపయోగించారు తప్ప రైతులకు ఉపయోగపడలేదు. 18.27 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగు లక్ష్యం. కానీ ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం 56 వేల ఎకరాలు మాత్రమే సాగయ్యింది. ప్రాజెక్ట్ డొల్లతనం బయటపడింది. ప్రజలను మోసగించడం కోసమే దీన్ని కట్టారు." అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
"ఇంజినీరింగ్ నిపుణులు చేసిన సూచనలను పట్టించుకోకుండా, అధికారుల నోర్లు మూయించి కేసీఆర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. ఇది పిచ్చి తుగ్లక్ డిజైన్. ఒక పనికిరాని చెత్త ప్రాజెక్ట్ కట్టారు. ఇదొక పెద్ద బ్లండర్. తల మీది నీటిని నోట్లోకి తీసుకురాకుండా, కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి ఆపై నోటి దగ్గరకు తెచ్చినట్టుగా ఈ డిజైన్ ఉంది. ఆయన ఫాం హౌస్ కి మాత్రం నీరు అందుతోంది తప్ప రైతులకు కాదు. పిల్లర్లు కుంగిపోవడానికి కుట్ర కారణం అంటున్నారు. ఇంతకంటే చేతకానితనం ఇంకేమీ ఉండదు. దీని మీద న్యాయ విచారణకు సీఎం సిద్ధంగా ఉన్నారా? దీనిపై కేసు పెట్టాలంటే ముందు సీఎం కేసీఆర్ మీద పెట్టాలి. ప్రాజెక్ట్ భద్రత, నాణ్యత, డిజైన్ అన్నింటిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఇంజినీర్ల అభ్యంతరాలు నిజం అని తేలింది. అందుకే సీఎం నోరు మెదపడం లేదు. డ్యాం సేఫ్టీ నిపుణులు ప్రాజెక్ట్ పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నారు. వాళ్ళు డ్యాం డిజైన్లు అడుగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడం లేదు. కుంగిపోడానికి కారణం తెలుసుకుని, దానికి పరిష్కారం కోసం ఇంజినీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కుట్ర కోణం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం సాంకేతిక అనుమతులు కోరితే ఇస్తుంది. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు. మేము ఇక్కడే కడతాం అంటే మేము వద్దని చెప్పడానికి ఉండదు. కేంద్ర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే అప్పు ఇచ్చాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి బీజేపీ బలహీనం అయింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ - అమిత్ షా మీటింగ్ ఉంది. పొత్తులపై చర్చిస్తాం. జనసేన ఎన్డీయే భాగస్వామి. అందుకే పొత్తులపై చర్చిస్తున్నాం. ఎన్డీయేలో ఉన్న కొన్ని పార్టీలు రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. లోక్ జనశక్తి వంటివి ఉదాహరణలు. నవంబర్ 1న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఆరోజు భేటీ తర్వాత తదుపరి జాబితా విడుదల ఉంటుంది." అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Updated Date - 2023-10-25T18:48:27+05:30 IST