గోవిందా.. హరి గోవిందా..
ABN , First Publish Date - 2023-10-20T00:31:23+05:30 IST
సిరిసిల్ల లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వేళైంది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సిరిసిల్ల లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వేళైంది. శనివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 800 ఏళ్ల చరిత్ర కలిగిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఏటా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా అదే స్థాయిలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నెల 21వ తేదీ ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 30వ తేదీ వరకు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు రోజుకో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 23న లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 28న 30 అడుగుల ఎత్తుతో 160సంవత్సరాల చరిత్ర ఉన్న మహారథంపై స్వామివారిని ఊరేగిస్తారు. కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
రోజుకో వాహనంపై స్వామివారి దర్శనం
అతి పురాతనమైన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాశస్త్యాన్ని పరిశీలిస్తే మానేరు నదీ ప్రవాహంతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే మానేరు ఒడ్డున మాండవ్య మహాముని ఆశ్రమం ఉండేది. మాండవ్య ముని తపస్సు చేయగా మహా విష్ణు ప్రత్యక్షమై మహాయాగానికి అనుమతిచ్చాడు. ఆ యాగం తరువాత గ్రామ జమిందార్లు ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత 200 సంవత్సరాల శాలివాహన శకం 1826 ప్రాంతంలో మొగలాయిల, కాకతీయుల రాజ్యంపై దండెత్తి హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ శ్రీశాల కేశవనాథ స్వామి విగ్రహాన్ని కూడా పగుల గొట్టారు. ఇప్పటికీ ఈ దేవాలయంలో విగ్రహం భద్రపరిచి ఉంది. ఇలా ఎంతో పురాతనమైన ఈ దేవాయలంలో 12 వివిధ వాహనాలను స్వామి సేవకు ఉపయోగిస్తారు. బ్రాహ్మోత్సవాల్లో 21న పులికాపు, 22న శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు, 23న లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం, హంసవాహనంపై ఊరేగింపు, 24న సింహవాహనం, అశ్వవాహనంపై శమిదర్శనం, విజయదశమి వేడుకలు, 25న గరుడ వాహనం, కాళింగమర్థనం, హనుమంతవాహనంపై స్వామివారి ఊరేగింపు, వేద సదస్సు, నిర్వహిస్తారు. 26 సూర్య వాహనం, రంగనాయక తిరొప్పలం, చంద్రవాహనాలపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది. 27న అండాలమ్మవారికి ఒడిబియ్యం, పొన్నవాహనంపై స్వామివారి ఊరేగింపు, 28న స్వామివారి మహా రథోత్సవం జాతర, 29న మహాపూర్ణహుతి, చక్రతీర్థం, 30న నాగబలి, పుష్పయాగము, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం సుందరకాండ పారాయణం, విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణం, లలిత సహస్త్ర పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
చంద్రగ్రహణంతో రథోత్సవ వేడుక కుదింపు
బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన స్వామివారి మహారథోత్సవ కార్యక్రమాన్ని కుదించారు. ఈ నెల 28న జరిగే రథోత్సవం రోజున చంద్రగ్రహణం ఉండడంతో సాయంత్రం జరిగే మహా రథోత్సవ శోభాయాత్రను మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభించి 5 గంటల లోపు ముగిస్తారు. 5 గంటలకు ఆలయం మూసివేస్తారు. ఉదయం తెల్లవారు జాము నుంచి రథంపై స్వామివారి దర్శనం ఉంటుంది.