scorecardresearch

రైతుబంధు సాయమేది?

ABN , First Publish Date - 2023-06-18T00:39:27+05:30 IST

వానాకాలం సీజన్‌ ప్రారంభమైనా కూడా రైతుబంధు సాయం చేసే విషయమై ప్రభుత్వం ఊసెత్తడం లేదు. యాసంగి సీజన్‌లో పండించిన ధాన్యాన్ని విక్రయించగా రావాల్సిన డబ్బులు చేతికి రాకపోగా, రైతుబంధు డబ్బులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రైతుబంధు సాయమేది?

- పథకం ఊసెత్తని ప్రభుత్వం

- మొదలైన వ్యవసాయ పనులు

- రైతుల ఖాతాల్లో జమ కాని డబ్బులు

- పెట్టుబడుల కోసం రైతుల ఇబ్బందులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

వానాకాలం సీజన్‌ ప్రారంభమైనా కూడా రైతుబంధు సాయం చేసే విషయమై ప్రభుత్వం ఊసెత్తడం లేదు. యాసంగి సీజన్‌లో పండించిన ధాన్యాన్ని విక్రయించగా రావాల్సిన డబ్బులు చేతికి రాకపోగా, రైతుబంధు డబ్బులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 2,83,321 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఆరుతడి పంటలను సాగు చేసే భూములను ఇప్పటికే దుక్కులు దున్ని చదును చేశారు. తొలకరి జల్లులు కురియగానే విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. దుక్కి దున్నేందుకు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతుల వద్ద పెట్టుబడి సొమ్ము లేక సతమతం అవుతున్నారు. యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. జిల్లాలో 690 కోట్ల రూపాయల విలువైన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు 255 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమచేసింది. ఇంకా 435 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. మరోవైపు.. బ్యాంకుల్లో పాత రుణాలు చెల్లిస్తేనే అధికారులు కొత్తగా రుణాలు ఇస్తారు. ప్రస్తుతం డబ్బులు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. రైతుబంధు డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018 యాసంగి సీజన్‌ నుంచి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి సంవత్సరం ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా, ఆ తర్వాత సీజన్‌ నుంచి రూ.5 వేలు అందిస్తున్నది. ప్రతి ఏటా రెండు సీజన్లకు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. సీజన్‌ ప్రారంభానికి 15రోజుల ముందు నుంచే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సొమ్మును ఇస్తున్నది. పట్టా కలిగిన ప్రతి రైతుకు సాయాన్ని ఎలాంటి సీలింగ్‌ లేకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌ దారులు, ఐటి చెల్లింపుదారులకు కూడా సాయాన్ని ఇస్తున్నారు.

ఫ సొమ్ము జమ చేయడంలో జాప్యం

జిల్లాలో 1,52,184 మంది రైతులు ఉన్నారు. ఇందులో రెండున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1,15,872 మంది, రెండున్నర నుంచి 5 ఎకరాల వరకు గల రైతులు 26,821 మంది, 5 నుంచి 10 ఎకరాల వరకు 8,106 మంది, 10 నుంచి 25 ఎకరాల వరకు గల రైతులు 1,312 మంది, 25 ఎకరాలకు పైగా భూములు ఉన్న రైతులు 73మంది ఉన్నారు. గత ఏడాది వానాకాలం సీజన్‌లో జిల్లాలోని 1,41265 మంది రైతులకు 135 కోట్ల 37లక్షల 70వేల రూపాయలను అందజేసింది. వాస్తవానికి గడిచిన యాసంగిలో 1,50,460 మంది రైతులకు 138 కోట్ల 52 లక్షలు చెల్లించాల్సి ఉండగా, 1,39,482 మంది రైతులకు 133 కోట్ల 50 లక్షల 60 వేల రూపాయలు ఖాతాల్లో జమ చేశారు. కొంత మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయక పోవడం గమనార్హం. ఈ సీజన్‌లో కూడా రైతుబంధు సొమ్ము జమ చేయడంలో తీవ్ర జాప్యం చేసింది. సాధారణంగా సీజన్‌ ప్రారంభంలోనే డబ్బులు చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఏడాదికాలంగా ఆలస్యం చేస్తున్నది. ప్రస్తుత సీజన్‌లో రైతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఆదిరెడ్డి పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో ఎంత మంది రైతులు పట్టాలు కలిగి ఉంటారో వారందరికీ రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ, ఇంతవరకు ఖాతాల్లో డబ్బులు జమకాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే తొలకరి జల్లులు పడాల్సి ఉండగా, రాష్ట్రానికి ఇంకా నైరుతి రుతు పవనాలు రాలేదు. మరో నాలుగైదు రోజుల సమయం పట్టవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొంటున్నారు. ఆరుతడి పంటలను సాగు చేసే రైతులు ట్రాక్టర్లతో దుక్కులు దున్నించారు. తమ వద్ద డబ్బులు లేకున్నా ఉద్దెరకు దుక్కులను దున్నించుకున్నారు. పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తే అప్పుడే భూమిలో విత్తనాలు వేయాలని రైతులు భావిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం రైతుబంధు సాయం గురించి ఇప్పటివరకు ప్రస్తావన తీయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుబంధు సాయం డబ్బులను విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-06-18T00:39:27+05:30 IST