Mahmood Ali: తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది: హోంమంత్రి
ABN, First Publish Date - 2023-11-16T12:39:31+05:30
ఖమ్మం జిల్లా: మంత్రి పువ్వాడ అజయ్ ప్రచారం కోసం తాను ఖమ్మం వచ్చానని, ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంట్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున మాట్లాడతారని హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లా: మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvwada Ajay) కోసం తాను ఖమ్మంలో ప్రచారానికి వచ్చానని, ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageswararao) పార్లమెంట్‌లో బీఆర్ఎస్ (BRS) పార్టీ తరపున మాట్లాడతారని హోంమంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మంత్రి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, మైనార్టీల అభివృద్ధి ఎంతగానో జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి మైనార్టీలకు ఎటువంటి పథకాలు అందించలేదని విమర్శించారు.
అంతకుముందు ముస్లింలు ఎక్కువగా హోటల్, మెకానిక్ పనులు చేసేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ (CM KCR) ఆధ్వర్యంలో ముస్లింల కోసం స్కూల్స్, కాలేజీలు నిర్మించి ముస్లింల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని మహమూద్ అలీ కొనియాడారు. మైనార్టీల కోసం రూ. 2,400 కోట్లు ఖర్చు చేశారని, ఎంతోమంది ముస్లిం పిల్లలకు బీఆర్ఎస్ అండగా నిలిచిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం షాధి ముభారక్ పథకం (Shadi Mubarak Scheme) ప్రవేశ పెట్టి ముస్లిం ఆడబిడ్డలకు అండగా నిలిచిందన్నారు.
2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరోజు కర్ఫ్యూ (Curfew) విధించలేదని, కాంగ్రెస్ (Congress), టీడీపీ (TDP) పార్టీలు రెండు అధికారంలో ఉన్నసమయంలో ఎన్నోసార్లు కర్ఫ్యూ విధించాయని మహమూద్ అలీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కరెంట్ సరిగా ఉండేది కాదని, ఇండస్ట్రియల్స్‌కు, రైతులకు కరెంట్ కూడా ఇచ్చేవారు కాదని, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా పెట్టించిన ఘనత కేవలం సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని, దేశంలో బియ్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.
టీపీసీసీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ నాయకుడు కాదని, ఆయన ఆర్ఎస్ఎస్ (RSS)కు చెందిన నాయకుడని మహమూద్ అలీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి 20 మంది సీఎంలు ఉన్నారని, బీఆర్ఎస్‌కు కేవలం ఒక్కరే సీఎం అని, అది కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం అందించింది మహాత్మా గాంధీ అని, రాష్ట్రానికి స్వాతంత్య్రం అందించింది సీఎం కేసీఆర్ అని, ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు వస్తాయని, గతంలో ఖమ్మం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు.
Updated Date - 2023-11-16T12:39:32+05:30 IST