Khammam జిల్లాలో రాజకీయంగా పెను కుదుపునకు రంగం సిద్ధమైందా?
ABN, First Publish Date - 2023-02-04T13:44:41+05:30
తాడే పామై కరిచినట్టు పొంగులేటి పలుకుబడి, డబ్బుతో విజయం సాధించిన నేతలు సైతం ఆయనకు దూరమయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయనకు డెడ్ యాంటీ అయిపోయారు.
Khammam : ఖమ్మం జిల్లా.. ఒకప్పుడు వామపక్షాల అడ్డా. తరువాత క్రమక్రమంగా మార్పొచ్చింది. వామపక్షాల హవా తగ్గిపోతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి జిల్లా ప్రజలు జేజేలు పలికారు. ఆ తరువాత టీడీపీ హవా కొంతకాలం కొనసాగింది. ఆ తరువాత టీఆర్ఎస్ (ప్రస్తుతం BRS) జిల్లాలోకి రంగ ప్రవేశం చేసింది. నిజానికి తెలంగాణ (Telangana) వచ్చిన తొలినాళ్లలో ఆ పార్టీ తెలంగాణలో ఖాతాను కూడా తెరవలేకపోయింది. ఆ తరువాత క్రమక్రమంగా ఆపరేషన్ ఆకర్ష్ వంటి పథకాలతో జిల్లా ప్రజాప్రతినిధులను వారి అనుచరగణాన్ని తమ పార్టీలో చేర్చుకుంది. అంతే ఖమ్మం జిల్లా దాదాపుగా గులాబీ పార్టీ హస్తగతమైంది.
ఇక గులాబీ పార్టీ ఎంత అనూహ్యంగా జిల్లాలోకి ప్రవేశించిందో అంతే అనూహ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 వరకూ సామాన్య ప్రజానీకానికి పెద్దగా పొంగులేటి ఎవరనే విషయం కూడా తెలియదు. వైసీపీ (YCP) తరుఫున ఎంపీ టికెట్ చేజిక్కించుకుని అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ తరుఫున ఎంపీగా మరోమారు పోటీ చేసిన నామ నాగేశ్వరరావు మట్టి కరిపించేసి తాను విజయం సాధించారు. ఆ తరువాత తన అనుచరగణంతో కలిసి ఆయన కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కానీ పరిస్థితులు మాత్రం ఆయనకు సహకరించలేదు.
తాడే పామై కరిచినట్టు..
ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానిదే హవా. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగులేటికి రాజకీయంగా ఎదిగే అవకాశం పెద్దగా దొరకలేదనే చెప్పాలి. ఒకవైపు ఆయనకు పెద్దగా అప్పటికి రాజకీయాల్లో అవగాహన లేకపోవడం.. మరోవైపు తల పండిన నేతలుండటం వంటి అంశాలు ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించాయి. చివరకు అధిష్టానం దగ్గర కూడా ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. తాడే పామై కరిచినట్టు ఆయన పలుకుబడి, డబ్బుతో విజయం సాధించిన నేతలు సైతం ఆయనకు దూరమయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయనకు డెడ్ యాంటీ అయిపోయారు.
వైఎస్ విజయమ్మతో భేటీ..
ఈ క్రమంలోనే అధిష్టానం కూడా ఆయనను పక్కన పెట్టేయడం మనస్థాపానికి గురి చేసింది. దీంతో టీఆర్ఎస్‌ను వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు చోట్ల పొంగులేటి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పొంగులేటి వైఎస్సార్‌టీపీలో చేరున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలతో భేటీ అయిన ఆయన నేడు వైఎస్ విజయమ్మతో సైతం భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై వరుస మంతనాలు జరుపుతూ వస్తున్నారు. ఈ నెల పాలేరులో వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. ఆ సమయంలో పొంగులేటి వైఎస్సార్‌టీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది.
భారీ స్కెచ్‌తోనే రంగంలోకి..
మొత్తానికి ఖమ్మం జిల్లాలో భారీ కుదుపునకు రంగం సిద్ధమైనట్టు గానే కనిపిస్తోంది. నిజానికి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామ నాగేశ్వరరావు, ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌లదే హవా. కానీ వీరు వ్యక్తిగతంగా క్యాడర్‌కు కాస్త దూరమనే టాక్ బాగా నడుస్తోంది. ఇప్పుడిప్పుడు తుమ్మల ప్రజలకు బాగా చేరువవుతున్నారని తెలుస్తోంది. అయితే పొంగులేటి మాత్రం ఈసారి భారీ స్కెచ్‌తోనే రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. వీరందరినీ ఎదుర్కొనేందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Updated Date - 2023-02-04T15:29:00+05:30 IST