Ponguleti: రైతు బంధును అడ్డం పెట్టుకుని కేసీఆర్ డ్రామాలు..
ABN, First Publish Date - 2023-11-28T13:57:52+05:30
ఖమ్మం జిల్లా: సిపిఐ తెలంగాణ రాష్ట్ర ప్రజల విముక్తి కోసం పోరాడుతోందని, ఈ ఎన్నికలలో ఒక్క సీటు తీసుకుని 118 సీట్లలో సిపిఐ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషిచేస్తున్నారని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఖమ్మం జిల్లా: సిపిఐ తెలంగాణ రాష్ట్ర ప్రజల విముక్తి కోసం పోరాడుతోందని, ఈ ఎన్నికలలో ఒక్క సీటు తీసుకుని 118 సీట్లలో సిపిఐ నేతలు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషిచేస్తున్నారని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మంలోని సాయిగణేష్‌నగర్‌లో తుమ్మల నాగేశ్వరరావు, సిపిఐ నేత నారాయణ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణలో బెదిరింపులకు భయపడకుండా ప్రలోభాలకు లొంగకుండా నిజాలు నిర్బయంగా ప్రజలకు తెలియజేస్తున్న మీడియా సంస్థలు, ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. నరరూపరాక్షసుడి పాలన అంతమొందించాలని అన్ని పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపాయన్నారు. ఇక వార్ వన్ సైడ్ అని, కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్ది కూనంనేని సాంశివరావుతో సహ అందరు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం చిత్తశుద్ధితో కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేస్తున్నారు.
ఆర్టీసీని అడ్డం పెట్టుకుని దుర్మార్గాలకు, దోపిడీకి పాల్పడ్డారని, ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో ఉన్నారని, సింగరేణి కార్మికులను కంటికిరెప్పలా కాపాడుకుంటామని పొంగులేటి అన్నారు. రైతు బంధును అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని, నోటిఫికేషన్‌కు ముందు ఎందుకు రైతు బంధు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీపై బురదజల్లుతున్నారని, రైతు బంధు అడ్డుకున్నారంటూ దుష్ప్రప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు వ్యాఖ్యలవల్లే ఎలక్షన్ కమిషన్ రైతు బంధు నిలిపి వేసిందని, దీనికి హరీష్ రావే కారణమన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతన్నలను మోసం చేస్తోందని పొంగులేటి విమర్శించారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని, డిసెంబర్ నెలాఖరులోగా రైతుల ఖాతాలలో నగదు జమచేస్తామని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ మానస పుత్రికని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాలేరు నియోజకవర్గంలో తనను ఓడించటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశారని, వందల కోట్ల అవినీతి సొమ్ము విచ్చలవిడిగిగా వెదజల్లుతున్నారన్నారు. పాలేరులో కేసీఆర్ ఆటలు సాగవని, తాను గెలవడం ఖాయమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-11-28T13:57:54+05:30 IST