DK Aruna: తెలంగాణలో నియంత పాలన అంతమయ్యే దాకా బీజేపీ నిద్రపోదు
ABN, First Publish Date - 2023-07-31T14:29:17+05:30
జిల్లాలోని బీజేపీ మహా ర్యాలీ నిర్వహించింది.
మహబూబ్‌నగర్: జిల్లాలోని బీజేపీ (BJP) మహా ర్యాలీ నిర్వహించింది. అనంతరం క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy), జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ , మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారీ, ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ... తెలంగాణాలోని నియంత పాలన అంతం అయ్యే దాకా బీజేపీ నిద్రపోదన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చేదాకా వదలమని.. లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామని హామీ ఇచ్చారు. మందిని మోసం చేసే విధానం సీఎం కేసీఆర్‌కు వచ్చినంతగా ఎవ్వరికీ సాధ్యం కాదన్నారు. సీఎం కేసీఆర్ సోయి తప్పి ఫామ్లో పండుకున్నారని వ్యాఖ్యలు చేశారు. టూబీహెచ్‌కే, రుణమాఫీ, ఉపాధి ఇలా ఎన్నో హామీలు ఇచ్చారని.. ఏవైనా హామీలు నెరవేర్చారా అని బీజేపీ నేత ప్రశ్నించారు.
మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నారని... ఈ మోసగాని మాటలను ప్రతీ ఒక్కరికీ తెలిసేలా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన పేరున అప్పులు తెచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా.. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారన్నారు. సీఎం కేసీఆర్‌లానే.. ఆ పార్టీ నేతలు కింది స్థాయి నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తున్నారని... ఇక్కడ అభివృద్ధి పేరున కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. జరిగిన అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగిందన్నారు. ఇక్కడ నడిఊర్లో ఉన్న కలెక్టరేట్‌ను కూల్చి.. ఆయన ఇంటికి దగ్గర్లో కట్టించుకున్నారన్నారు. హెరిటేజ్ బిల్డింగ్‌ను కూల్చి ఏం చేస్తున్నారో చెప్పాలని... జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
Updated Date - 2023-07-31T14:29:17+05:30 IST