Kishan Reddy: ఆ మూడు పార్టీల డీఎన్ఏ ఒకటే
ABN, First Publish Date - 2023-07-31T14:54:29+05:30
బీజేపీ చేపట్టే ఏ పోరాటమైనా పాలమూరు నుంచే ఆరంభించటం ఆనవాయితీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.
మహబూబ్‌నగర్: బీజేపీ చేపట్టే ఏ పోరాటమైనా పాలమూరు నుంచే ఆరంభించటం ఆనవాయితీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి (Telangan BJP Chief Kishan Reddy) అన్నారు. సోమవారం జిల్లాలోని క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు నుంచే డబల్ బెడ్ రూం సమస్యలపై నిరసన ర్యాలీ చేపట్టామన్నారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్ 10 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ - కాంగ్రెస్ కుమ్ముక్కై పార్టీ కార్యాలయాలకు జాగాలిస్తారని.. కాని పాలమూరులో ఉన్న పేదలకు ఇళ్లు కట్టరని మండిపడ్డారు. 9 ఏళ్లలో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప కేసీఆర్ సర్కారుకు పేదలకు రేషన్ కార్డులిచ్చే సోయి లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. దళితులకు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠంపై కూర్చున్న ఘనత కేసీఆర్ ది అని ఆయన అన్నారు.
9 ఏళ్లలో ఒక్క పోస్టుకూడా భర్తీ చేయలేదన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఆకలిమంటల్లో ఉన్నారని తెలిపారు. పేపర్ లీక్‌తో నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నారన్నారు. ప్రజలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది అని వ్యాఖ్యలు చేశారు. రైతు రుణ మాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అప్పులు కట్టలేక డిఫాల్టర్‌గా మారటం వల్ల రైతులకు అప్పు పుట్టటం లేదన్నారు. బంగారు తెలంగాణ దేవుడెరుగు, కానీ కేసీఆర్ కుటుంబం బంగారమైందన్నారు. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ప్రజలను మోసం చేయటం కోసమే పార్టీ పెట్టారని.. సీఎం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ తెలంగాణగా, అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణలో మార్పు రావలసిన అవసరం ఉందన్నారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలంటూ విరుచుకుపడ్డారు. మూడు పార్టీల డీఎన్ఏ ఒకటే అన్నారు. ఈ మూడు పార్టీలు ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-07-31T14:54:29+05:30 IST