గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Dec 27 , 2023 | 11:14 PM
కంది సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కాల్వ సరళాపుల్లారెడ్డి

కంది, డిసెంబరు 27: ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీపీ కాల్వ సరళాపుల్లారెడ్డి సూచించారు. కందిలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీపీ సరళాపుల్లారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆయా శాఖల అధికారులు వివరణ ఇచ్చారు. ఎక్కువగా నీటి సమస్యలపై, ఆరోగ్య సమస్యలపై చర్చలు జరిగాయి. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. చలికాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, గ్రామాలకు వెళ్లే రోడ్లపై గుంతలు లేకుండా మరమ్మతు చేయించాలని సంబంధిత శాఖ అధికారులకు ఎంపీపీ సూచించారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. అనంతరం జడ్పీటీసీ కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల సమస్యలు పరిష్కరించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించి, పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడుతూ.. తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని, ఆయా శాఖల అధికారులు సహకరించాలని వారు కోరారు. మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, ఎంపీడీవో విశ్వప్రసాద్, ఎంపీవో మహేందర్‌రెడ్డి, సూపరింటెండెంట్ వేణు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.