Harish Rao: కాంగ్రెస్ వస్తే రైతులకు మీటర్లు తప్పవు
ABN, First Publish Date - 2023-11-22T11:45:29+05:30
మోటర్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే అదనపు డబ్బులు రాలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కుండ బద్దలు కొట్టారని, ఇంత కాలం బీజేపీ నాయకులు (BJP Leaders) అబద్దాలతో దబాయించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
సిద్దిపేట: మోటర్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే అదనపు డబ్బులు రాలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కుండ బద్దలు కొట్టారని, ఇంత కాలం బీజేపీ నాయకులు (BJP Leaders) అబద్దాలతో దబాయించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ... ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు ఈ ముఖం పెట్టుకుని ఒట్లు అడుగుతారని ప్రశ్నించారు.
ఈ దేశంలో ఒకే ఒక్క రైతు పక్షపాతి కేసీఅర్ అని, కాంగ్రెస్ బండారం కూడా నిర్మలా సీతారామన్ బయట పెట్టాలని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మీటర్లు పెట్టారని ఆమె చెప్పారని ప్రస్తావించారు. ఇక్కడ కాంగ్రెస్ లేదా బీజేపీ సర్కారు ఉండి ఉంటే రైతుల మోటర్లకు మీటర్లు, రైతులకు బిల్లులు వచ్చేవని, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి అదనపు డబ్బులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్ వస్తే రైతులకు మీటర్లు తప్పవని హెచ్చరించారు. గెలిచిన కర్ణాటకలో 5 గంటలు మాత్రమే ఇస్తున్నట్లు డికె శివకుమార్ స్పష్టం చేశారని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతులకు శత్రువులని హరీష్‌రావు అన్నారు.
యూపీఏ హయాంలో స్వామినాథన్ కమిటీ రైతుల బాగు కోసం నివేదిక ఇచ్చారని, యూపీఏ ఆ కమిటీని తుంగలో తొక్కితే, తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని బీజేపీ చెప్పిందని, తొమ్మిదేళ్లుగా ఆ ఊసే లేదని.. ఆ రెండు జాతీయ పార్టీలు దొందు దొందేనని హరీష్‌రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్ వంటి రాష్ట్రాల్లో మీటర్లు పెట్టారని, మీటర్లు పెట్టని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. రైతులను ముంచడంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయడం అంటే బోరు బావులకు మీటర్లు పెట్టుమని ఒప్పుకున్నట్లేనన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీటర్లు పెట్టారని నిరూపించడానికి సిద్దంగా ఉన్నానని, ఎవరొస్తారో రావాలని హరీష్‌రావు సవాల్ చేశారు. పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఏటా రూ. 9 వేల కోట్లు తెచ్చుకుంటుందని, ఈ రోజు తెలంగాణ రూ. 3.17 లక్షల తలసరి ఆదాయమని, పదేండ్ల క్రితం పదో స్థానంలో ఉన్న తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. దేశం తలసరి ఆదాయం లక్షా 72 వేలు ఉందని.. ఎవరి పాలన బాగుందో తెలిసిపోతుందన్నారు. ఢిల్లీలో తెలంగాణ శభాష్ అంటారని.. గల్లిలో తిడతారని అన్నారు. తొమ్మిదేళ్లలో 9 లక్షల కొట్లు అప్పు చేసిందని, నెలకు లక్ష కోట్ల అప్పులు కేంద్రం చేస్తోందని విమర్శించారు. రిజర్వ్ బాంక్ విడుదల చేసిన లెక్కల ప్రకారం అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రం కింది నుంచి అరో స్థానం తెలంగాణదని మంత్రి పేర్కొన్నారు.
బీజేపీ అప్పులు చేసి కార్పొరేట్లకు, బడా కంపెనీలకు కట్టబెట్టిందని, లక్షల కోట్లు బడా కంపెనీలకు మాఫీ చేసిన ఘనత బీజేపీదని హరీష్‌రావు ఆరోపించారు. బీజేపీ హయాంలో రూపాయి విలువ, సిపాయి విలువ తగ్గిందని, నిరుద్యోగం పెరిగిందని విమర్శించారు. దేశంలో అత్యధికంగా వడ్లు పండే రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందన్నారు. 150 కోట్ల దేశంలో కేంద్రం ఇచ్చినవి, చెప్పుకుంటున్న ఉద్యోగాలు 8 లక్షలని, 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి వెల్లడించారు. ‘‘రాష్ట్రంలోని ఉద్యోగులకు అప్పీల్ చేస్తున్నా.. కొన్ని కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కొంత ఇబ్బంది అయింది.. లక్ష కోట్ల నిధులు కేంద్రం ఆపింది.. రాబోయే రోజుల్లో పరిస్థితిని సరిదిద్ది ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తాం.. రెండు పీఆర్సీలతో 133 శాతం జీతాలు ప్రభుత్వం పెంచింది.. తమది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగులు, చిరు ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని దీవించాలి’’ అని మంత్రి హారీష్‌రావు కోరారు.
Updated Date - 2023-11-22T12:22:06+05:30 IST