Minister: త్వరలో పాదయాత్ర చేస్తా...
ABN, First Publish Date - 2023-10-12T13:21:12+05:30
అమావాస్య ముగిసిన తర్వాత పాదయాత్రకు శ్రీకారం చుడతానని బీఆర్‌ఎస్ సనత్‌నగర్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) తెలిపారు.
సికింద్రాబాద్, (ఆంధ్రజ్యోతి): అమావాస్య ముగిసిన తర్వాత పాదయాత్రకు శ్రీకారం చుడతానని బీఆర్‌ఎస్ సనత్‌నగర్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) తెలిపారు. ఈ నెల 16న నియోజకవర్గ సాధారణ కార్యవర్గ సమావేశం నిర్వహించి, పాదయాత్రల నిర్వహణ, ప్రచార సరళి, తదితర అంశాలపై కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బుధవారం మారేడుపల్లిలోని తన నివాసం వద్ద నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో తలసాని కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రతి పాదయాత్రకు వెయ్యి మంది తక్కువ కాకుండా పార్టీ శ్రేణులు, జనసమీకరణ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గడిచిన రెండు పర్యాయాలుగా వందల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో, లేవో చూసుకోవలసిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. బీఆర్‌ఎస్ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్ ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బస్తీల పెద్దలు, యువతతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘మాకు మీరు’, ’మీకు మేము’, ‘మనందరికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం’ అనే నినాదంతో ముందుకు సాగుదామని తలసాని సాయికిరణ్ యాదవ్ సూచించారు. కార్యక్రమంలో అమీర్‌పేట్, సనత్‌నగర్, రాంగోపాల్‌పేట్, బన్సీలాల్‌పేట్, బేగంపేట్, మోండా మార్కెట్ (పాక్షికం) డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-12T13:21:12+05:30 IST