Rajaiah Vs Navya: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక పరిణామం
ABN, First Publish Date - 2023-06-21T18:08:51+05:30
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రాజయ్యపై ఫిర్యాదు చేసేందుకు ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌కు నవ్య వచ్చారు. స్టేషన్లో సీఐ, ఎస్ఐ లేకపోవడంతో వేచిచూస్తున్నారు. రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య మరోసారి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు
హనుమకొండ: ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah), సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రాజయ్యతో పాటు, భర్త ప్రవీణ్‌పై కేసు పెట్టేందుకు నవ్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఎమ్మెల్యే రాజయ్యతో పాటు, భర్త ప్రవీణ్, ఎమ్మెల్యే పీఏ, ధర్మసాగర్ ఎంపీపీపైనా ఆమె ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య మరోసారి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు, రాజయ్య పాల్పడ్డ వేధింపులకు సంబంధించి ఆడియో రికార్డులు ఇవ్వాలంటూ అనుచరులతో ఎమ్మెల్యే తనపై తీవ్ర ఒత్తిడి చేయిస్తున్నారని నవ్య ఆరోపించారు. గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న రూ.20 లక్షలు, ఇవ్వకపోగా అప్పుగా తీసుకున్నట్లుగా పత్రంపై సంతకం పెట్టాలని తనపై తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గం ఒత్తిడికి తన భర్త తలొగ్గారని, సంతకం పెట్టాలంటూ తనపై ఆయనా ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న డబ్బులు అప్పుగా ఇస్తున్నట్లుగా చెబుతూ పత్రంపై సంతకం పెట్టాలని ఒత్తిడి చేయడం సబబేనా? అని నవ్య ప్రశ్నించారు.
ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి
తాను డబ్బుల కోసం కాకుండా ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తనకు డబ్బులు తీసుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. తనపై ఒత్తిడి తెస్తున్న ఎమ్మెల్యే రాజయ్య, ఆయన పీఏ, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఓ మహిళతో పాటు వారి ప్రలోభాలకు లోనై తన మీద ఒత్తిడి తెస్తున్న భర్తను కూడా వదిలి పెట్టనని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2023-06-21T19:06:57+05:30 IST