ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Sitakka: ‘సాయమే’ ఆమె గెలుపునకు దోహదపడిందా...

ABN, First Publish Date - 2023-12-05T13:44:07+05:30

సామాజిక సేవలో నిమగ్నం కావడం, నిత్యం ప్రజల మధ్య ఉండడం, తాను గుర్తించిన సమస్యలను ప్రభుత్వానికి

- సీతక్కను గెలిపించిన సామాజిక సేవ

- కరోనా, వరద విపత్తుల్లో ఇంటింటికీ వితరణ

- మరోవైపు ప్రజా సమస్యలపై సర్కారుపై తిరుగుబాటు

- అసెంబ్లీలో సమావేశాల్లో తనదైన ముద్ర

ములుగు: సామాజిక సేవలో నిమగ్నం కావడం, నిత్యం ప్రజల మధ్య ఉండడం, తాను గుర్తించిన సమస్యలను ప్రభుత్వానికి విన్నవించడం.. అవసరమైతే నిలదీయడం తదితర లక్షణాలు ములుగు ఎమ్మెల్యేగా గెలిచేందుకు సీతక్క(Sitakka)కు దోహదపడ్డాయి. ఆదివారం నాటి ఎన్నికల ఫలితాల తర్వాత గెలుపోటములను స్కాన్‌ చేస్తున్న రాజకీయ విశ్లేషకులు నానా రకాల అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. అయితే నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటే విపత్కర పరిస్థితుల్లో కూడా గెలుపు దరిచేరొచ్చని సీతక్క విజయం నిరూపించిందని తేల్చి చెబుతున్నారు.

నెత్తిన మూటలు పెట్టుకొని..

కరోనా సృష్టించిన విలయంలో ప్రపంచమే అల్లాడుతుండగా ఆపన్నహస్తం కోసం అనేకమంది ఆర్తనాదాలు పెట్టారు. తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో అల్లాడిపోయారు. గడపదాటి బయటకు రావాలంటేనే వణికిపోతున్న పరిస్థితుల్లో సీతక్క ఉరూరూ తిరిగారు. ఇంటింటికీ నిత్యావసరాలు పంచారు. సరుకుల మూటలు నెత్తిన పెట్టుకుని వాగులు, వంకలు దాటారు. ఈ చిరుసాయం వేల కుటుంబాలకు ఊరటనిచ్చింది. దీంతో సీతక్కపై ప్రజల్లో అభిమానం మరింత పెరిగింది. ఏటూరునాగారం(Eturunagaram) గోదావరి ఉప్పొంగి పరీవాహక గ్రామాలన్నీ ముంపునకు గురైతే బాధితులకు ఆమె అండగా నిలిచారు. నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ రెండు సందర్భాల్లో కూడా సీతక్కకు స్వచ్ఛంద సేవా సంస్థలు మద్దతు ఇచ్చాయి. వందల క్వింటాళ్ల బియ్యం, బట్టలు, తీరొక్క సరుకులను స్వయంగా తీసుకొచ్చి అభాగ్యు లకు అందజేశారు. మంగపేట మండలం శనిగకుంట గ్రామం అగ్నికి ఆహుతైతే సీతక్క చొరవతో ఇళ్లు తప్ప ప్రతి కుటుంబానికీ కావాల్సిన వస్తువులన్నీ ఇప్పించారు. ఈ సేవా కార్యక్రమాలతో ఆమె ప్రజల మద్దతు ను కూడగట్టుకున్నారు.

అసెంబ్లీలో గళం

అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతీసారి సీతక్క తన వాగ్దాటితో ప్రభుత్వాన్ని నిలదీశారు. స్థానిక సమస్యలను ఏకరువు పెడుతూ పరిష్కారం కోరారు. ఆయా సందర్భాల్లో సీతక్క అడిగింది కాబట్టే నిధులు ఇస్తున్నామంటూ స్వయంగా మంత్రులే నిండు సభలో ప్రకటించడంతో ఆమెకు ప్రధాన్యం అమాంతం పెరిగింది. జిల్లా ఏర్పాటు నుంచి మల్లంపల్లి మండలం, ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్‌, మెడికల్‌ కళాశాల, జిల్లా ఆస్పత్రి, తదితర అంశాలన్నీ అసెంబ్లీ జీరో అవర్‌లో సీతక్క లేవనెత్తినవే. ములుగు అభివృద్ధిలో కీలకంగా మారిన వీటిని అధికార పార్టే తమ కృషి అని చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది.

ప్రతికూలతనే అనుకూలంగా..

సీతక్క ఇప్పటి వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మూడుసార్లు గెలిచారు. 2009, 2018లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం చేపట్టిన ఆమె తాజాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్కాచాటారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ఆమె ప్రాతినిధ్యం వహించిన పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. దీంతో ‘సీతక్కను గెలిపిస్తే ఏం ప్రయోజనం ఆమె ప్రతిపక్షంలోనే ఉంటుంది. అభివృద్ధి జరగదు’ అనే అపవాదు వచ్చింది. అయినప్పటికీ ప్రజాద రణతో ఓట్లు పొందిన సీతక్క ప్రస్తుత ఎన్నికల్లో తాను నిలబడ్డ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, మంత్రినై ములుగును అభివృద్ధి చేస్తానని ముందే ప్రకటించుకున్నారు. ఈ ట్యాగ్‌లైన్‌ పైనే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హస్తానికే అనుకూల పవనాలు వీయడం, ఏఐసీసీ, టీపీసీసీలో సీతక్క ప్రముఖ నేతగా కొనసాగుతుండడంతో ఆమెను గెలిపిస్తే కాం గ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి అవుతుందని విశ్వసించిన జనం ఓట్లేసేందుకు ముందుకొచ్చారు.

బీఆర్‌ఎస్‌ అతి విశ్వాసం

తొలిసారి 2014లో ములుగు సీటును గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ 2018 ఎన్నికల్లో చతికిలపడింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఉన్నప్పటికీ సీటును కాపాడు కోలేకపోయింది. దీనికి అతి విశ్వాసమే కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని దివంగత మంత్రి అజ్మీరా చందూలాల్‌ అతిగా విశ్వాసం పెట్టుకున్నారు. అయితే వ్యక్తిగతంగా ఆయనపై వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వచ్చి జిల్లా ప్రకటన చేసినా ప్రజలు విశ్వసించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఈ తరహా అతి విశ్వాసమే మరోసారి బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణంగా స్పష్టమవుతోంది. మళ్లీ ప్రజా ఆశీర్వాదసభకు వచ్చిన కేసీఆర్‌ ‘మీరు మా పార్టీ అభ్యర్థిని ఓడించినా అలగలేదు. జిల్లా ఇచ్చి మీ ఆకాంక్షను నెరవేర్చాను’ అని ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈసారి గనుక గెలిపించకుంటే మీతో పంచాయితీ పెట్టుకుంటానని సున్నితంగా చెప్పారు. అయినా ఆయన మాటలు ప్రజలను ప్రభావితం చేయలే కపోయాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి రాజకీయాలకు కొత్త కావడం, తొలిసారి ఎమ్మెల్యే బరిలో నిలిచిన ఆమె ప్రజలకు సుపరిచితురాలు కాకపోవడం, నియోజకవర్గస్థాయిలో ప్రభావంతమైన నాయకత్వం లేకపోవడం, అధిష్ఠానం పంపించిన ఇన్‌చార్జిలపైనే పూర్తిస్థాయిలో ఆధారపడడం వంటి అనేక అంశాలు ఆమెకు ప్రతికూలంగా మారాయి. ఇదే పార్టీ నుంచి టికెట్‌ ఆశించిన ఒకరిద్దరు నాయకులు పూర్తిస్థాయిలో సహకరించకపోవడం కూడా నాగజ్యోతి ఓటమికి కారణంగా తెలుస్తోంది.

బీజేపీ రూపంలో గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టికెట్‌ రాకపోవడంతో పార్టీని వీడి కమలం చెంత చేరిన ప్రహ్లాద్‌ ముమ్మర ప్రచారం చేసినప్పటికీ ఎన్నికలకు ముందురోజు నైతికంగా పోటీ నుంచి తప్పుకోవడంతో తమ ప్రతినిధిగా భావించిన లంబాడీలు కాంగ్రెస్‌ వైపు మళ్లారు. దీంతో బీఆర్‌ఎస్‌ చతికిలపడింది.

ములుగుకు మంచిరోజులు వచ్చేనా..?!

ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క చెప్పినట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఆమెకు కీలక మంత్రి పదవి కూడా వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈసమయంలో ములుగు నియోజకవర్గానికి మంచిరోజులు రాబోతున్నాయని సర్వత్రా భావిస్తున్నారు. గతంలో పోరిక జగన్నాయక్‌, అజ్మీరా చందూలాల్‌ ములుగు నుంచి గెలిచి మంత్రులుగా ఈప్రాంత అభివృద్ధికి బాటలు వేశారు. ఇదే తరహాలో సీతక్క కూడా ములుగు ప్రగతికి పెద్దఎత్తున నిధులు తెస్తారని జనం గంపెడాశలు పెట్టుకున్నారు.

Updated Date - 2023-12-05T13:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising