BJP Tarun Chugh : సంజయ్ అరెస్టు రాజ్యాంగ విరుద్ధం
ABN, First Publish Date - 2023-04-06T03:09:54+05:30
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అఽధక్షుడు బండి సంజయ్ అరెస్టుపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా పనిచేస్తోందని
కేసీఆర్ సర్కార్ నిరాశ, నిస్పృహల్లో ఉంది: తరుణ్ ఛుగ్
కల్వకుంట్ల కుటుంబానికి బానిసల్లా వ్యవహరించొద్దు
అరెస్టుకు కారణాలేంటి?.. డీజీపీకి కిషన్‌రెడ్డి ఫోన్
లీకేజీలు, ప్యాకేజీలు బయటకొస్తాయనే అరెస్టు: లక్ష్మణ్
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అఽధక్షుడు బండి సంజయ్ అరెస్టుపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా పనిచేస్తోందని మండిపడ్డారు. బండి అరెస్టుకు నిరసనగా బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, సోయం బాపూరావు, జీవీఎల్ నరసింహారావు పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. డౌన్ డౌన్ బీఆర్‌ఎస్, కేసీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో తరుణ్ ఛుగ్ విలేకరులతో మాట్లాడుతూ.. వారెంట్ లేకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక ఎంపీని అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని బీజేపీ ఖండిస్తోందని చెప్పారు. బండిని అరెస్టు చేసిన తీరు చూస్తే.. కేసీఆర్ ప్రభుత్వం నిరాశ, నిస్పృహ, ఆందోళనలో ఉన్నట్లు స్పష్టం అవుతోందన్నారు. టీఎ్‌సపీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు, కట్టుకథలు అల్లి కేసీఆర్ సర్కారు సంజయ్‌ని అరెస్టు చేసిందని ఆరోపించారు. కేసీఆర్ నియంత, కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అరెస్టులకు భయపడొద్దని బీజేపీ శ్రేణులకు సూచించారు. ‘‘అధికారమనే మత్తులో మునిగి తేలుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. తమకు వ్యతిరేకంగా గొంతెత్తే గళాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. నియంత, విఫలమైన కేసీఆర్ ప్రభుత్వం నిజరూపాన్ని విలేకరుల సమావేశంలో బండి సంజయ్ బయటపెట్టాలనుకున్నారు. అంతకంటే ముందే చట్టవిరుద్ధంగా బండిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో పేపర్ లీక్ గుట్టు రట్టయితీరుతుంది. ఈ అరెస్టుతో బీజేపీ భయపడదు. నియంతృత్వం ఇక ఎక్కువ రోజులు నడవదు’’ అంటూ ఛుగ్ ట్వీట్ చేశారు. ఓ కార్టూన్ యానిమేషన్ వీడియోను కూడా ట్వీట్‌తో జత చేశారు.
Updated Date - 2023-04-06T03:09:54+05:30 IST