ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somesh Kumar: కొత్త సీఎస్‌ నియామకంతో ఇప్పుడు సోమేష్ కుమార్ పరిస్థితి ఏంటంటే..

ABN, First Publish Date - 2023-01-11T16:56:44+05:30

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (Somesh Kumar) ఏపీకి (AP) వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రేపు ఏపీ ప్రభుత్వానికి ఆయన రిపోర్ట్ చేయనున్నట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (Somesh Kumar) ఏపీకి (AP) వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రేపు ఏపీ ప్రభుత్వానికి ఆయన రిపోర్ట్ చేయనున్నట్లు తాజా సమాచారం. డీఓపీటీ (DPOT) ఆదేశాలతో ఏపీ ప్రభుత్వానికి (AP Govt) రిపోర్ట్ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును హైకోర్టు రద్దు చేయడంతో ఆయన తన పోస్టుకు రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) వెళ్లే ఉద్దేశం, ఆసక్తి ఆయనకు ఏమాత్రం లేవని వార్తలొచ్చాయి.

2019 డిసెంబరు 31న తెలంగాణ సీఎస్‌గా నియమితులైన సోమేశ్‌కుమార్‌.. మూడేళ్లకు పైగా పదవిలో కొనసాగారు. ఈ సంవత్సరం డిసెంబరు 30తో ఆయన సర్వీసు కాలం ముగియనుంది. అంటే.. దాదాపు ఏడాదిపాటు ఐఏఎస్‌గా కొనసాగే వీలుంటుంది. దీంతో ఇంత తక్కువకాలం కోసం ఏపీకి వెళ్లి, చిన్న పోస్టులో కొనసాగడం అవసరమా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకే తన ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేస్తారని చర్చ కూడా జరిగింది. అనంతరం తెలంగాణ సర్కారు ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

సోమేశ్‌కుమార్‌ పట్ల సీఎం కేసీఆర్‌ మొదటి నుంచీ సానుకూల వైఖరితో ఉన్నారు. పైగా గతంలో సీఎస్‌లుగా పనిచేసిన రాజీవ్‌ శర్మ (Rajiv Sharma), ఎస్‌కే జోషిలను (SK Joshi) కూడా ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. రాజీవ్‌శర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సోమేశ్‌కుమార్‌ను నియమించవచ్చని వార్తలు గుప్పుమన్నాయి. ఒకవేళ రాజీవ్‌ శర్మను అలాగే కొనసాగిస్తే.. మరో ప్రధాన సలహాదారుగానైనా సోమేశ్‌ను నియమిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే సోమేశ్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేసి, తెలంగాణలోనే ఉండిపోతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమేష్ కుమార్ ఎట్టకేలకు మనసు మార్చుకున్నట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వం కూడా సోమేష్ కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

అసలేం జరిగిందంటే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం విదితమే. ఆయన ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు వెళ్లాల్సిందేనని మంగళవారం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఉమ్మడి రాష్ట్రంలోని సివిల్‌ సర్వెంట్ల విభజన వివాదానికి ఈ తీర్పు ద్వారా ముగింపు పలికింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్‌ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సోమేశ్‌ కుమార్‌ 2014లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌ 2016లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ(డీవోపీటీ) 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సుదీర్ఘంగా విచారించింది. పిటిషనర్‌ అయిన కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు.

ఐఏఎస్‌ క్యాడర్‌ రూల్స్‌కు విరుద్ధంగా క్యాట్‌ వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం నియమించిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణకు కేటాయించడం చెల్లదని సొలిసిటర్‌ జనరల్‌ అన్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. విధుల నుంచి వెంటనే రిలీవ్‌ కావాలంటూ సోమేశ్‌ కుమార్‌ను ఆదేశిస్తూ కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(డీఓపీటీ) మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 12 లోపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్‌ను ఆదేశించింది. డీఓపీటీ ఉత్తర్వులకు తలొగ్గి సోమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం.

Updated Date - 2023-01-11T17:01:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising