Revanth Vs Etela: భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన రేవంత్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-04-22T18:47:04+05:30
భాగ్యలక్ష్మి ఆలయంలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేశానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు.
హైదరాబాద్: భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భావోద్వేగానికి గురై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కంటతడి పెట్టారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరిన రేవంత్‌రెడ్డి.. అనుకున్నట్లే భాగ్యలక్ష్మి ఆలయానికి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ఈటలను దుయ్యబడుతూ రేవంత్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేశానని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. మునుగోడులో బీఆర్‌ఎస్, బీజేపీ (BRS BJP) వందల కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. మునుగోడులో సీఎం కేసీఆర్తో కాంగ్రెస్ ఎలాంటి లాలూచీ పడలేదని స్పష్టం చేశారు. ఏ ఆధారం లేనివారికి దేవుడే ఆధారమని వ్యాఖ్యానించారు. దేవుడిని తాను నమ్ముతానని తనపై అభాండాలు వేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌తో గానీ.. కేసీఆర్తో గానీ.. ఎలాంటి లాలూచీ పెట్టుకోలేదని తెలిపారు. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ప్రకటించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) ఆరోపణలు అవాస్తవమని రేవంత్రెడ్డి కొట్టిపారేశారు.
రేవంత్‌రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు
‘‘కేసీఆర్, కేటీఆర్ దోపీడీని బయటపెట్టినందుకు నన్ను జైల్లో పెట్టారు. జైల్లో నిద్ర లేని రాత్రులు గడిపాను. కేసీఆర్‌ను ఎదుర్కొని.. ధైర్యంగా నిలబడ్డా. నోటీసులు ఇవ్వగానే ఎవరికో నేను లొంగిపోలేదు. నాపై, పార్టీపై ఆరోపణలు చేస్తారా?.. ఈటల రాజేందర్.. ఆలోచించి మాట్లాడాలి. ఈటలపై కేసీఆర్ కక్ష కట్టినపుడు సానుభూతి చూపించాం. ఇది రాజకీయం కాదు.. నా మనోవేదన. అసత్య ఆరోపణలు మంచివి కాదు. కేసీఆర్‌ను ప్రశ్నించే గొంతులకు ఇదేనా నువ్విచ్చే గౌరవం?.. కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు. రేవంత్‌రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు. నా ఏకైక లక్ష్యం.. కేసీఆర్‌ను గద్దెదించడమే’’ అని రేవంత్ స్పష్టం చేశారు.
మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా కేసీఆర్ (KCR) నుంచి కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ముట్టాయని ఈటల ఆరోపించారు. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ.. కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. దాన్ని నిరూపించేందుకు సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, బీఆర్‌ఎస్ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని రేవంత్ స్పష్టం చేశారు. ఈ మేరకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం ఎదుట తడిబట్టలతో ప్రమాణం చేయడానికీ తాను సిద్ధమేనని ప్రకటించారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని ఈటలకు సూచించారు. ఈటలకు భాగ్యలక్ష్మి అమ్మవారిపై నమ్మకం లేకుంటే ఏ దేవాలయంలోనైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని తేల్చిచెప్పారు. ముందు ప్రకటించినట్లే రేవంత్‌రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు.
Updated Date - 2023-04-22T19:35:58+05:30 IST