PM Modi Hyd Tour: ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వెళ్లని తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎవరెళ్లారంటే..
ABN, First Publish Date - 2023-04-08T11:28:06+05:30
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు..
ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) హైదరాబాద్ పర్యటన (PM Modi Hyd Tour) నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, హైదరాబాద్‌లో (Hyderabad) రూ.11,360 కోట్ల రూపాయలతో జరగనున్న పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నట్లు తాజా సమాచారం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వందే భారత్ రైలును మోదీ ప్రారంభించనున్నారు. ఇది అధికారిక కార్యక్రమం. దాంతో, సీఎం కేసీఆర్‌కు పీఎంవో నుంచి ఆహ్వానం అందింది కూడా. ఏడు నిమిషాల పాటు కేసీఆర్‌కు మాట్లాడే సమయం కూడా ఇచ్చారు. అధికారిక కార్యక్రమం అయినా సీఎం కేసీఆర్ వెళ్లడం లేదని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఆయన బదులు ఎప్పట్లాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌లోని చిన జీయరు స్వామి ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ హాజరయ్యారు. శిలాఫలకంపై తన పేరు లేదన్న కోపంతో అప్పట్లో మోదీకి స్వాగతం, వీడ్కోలు చెప్పడానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. ఆ తర్వాత, ఐఎస్‌బీలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని హాజరైనా కేసీఆర్ వెళ్లలేదు. ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని వచ్చినా ఇదే పరిస్థితి. అయితే.. కేసీఆర్ గైర్హాజరుపై బీఆర్‌ఎస్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో భారత్ బయోటెక్‌ను సందర్శించేందుకు ప్రధాని మోదీ వచ్చారని, అప్పట్లో స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్‌ను రావద్దని అన్నారని, ఇప్పుడు కార్యక్రమానికి సీఎం ఎందుకెళతారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. మోదీది సంకుచిత మనస్తత్వమని, అసలు తొలుత ప్రొటోకాల్‌ను ఉల్లంఘించింది ఆయనేనని చెప్పారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా వ్యాక్సిన్‌ను కనుగొన్న భారత్ బయోటెక్ సంస్థను సందర్శించేందుకు 2020 నవంబరు 26న ప్రధాని మోదీ వచ్చారు. ఆయన హైదరాబాద్ పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ వెళదామనుకున్నారు. కానీ, రావద్దని ప్రధాని కార్యాలయం కరాఖండిగా చెప్పింది. ఫొటోలో తాను ఒక్కడినే కనిపించాలనేది మోదీ సంకుచిత మనస్తత్వం. ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి మాకు దారి చూపింది మోదీయే’’ అని తెలిపారు.
Updated Date - 2023-04-08T11:29:33+05:30 IST